రెండ్రోజుల్లో 4 కిలోలకు పైగా గోల్డ్ సీజ్.. ఎయిర్​పోర్టులో నలుగురి అరెస్ట్

రెండ్రోజుల్లో 4 కిలోలకు పైగా గోల్డ్ సీజ్.. ఎయిర్​పోర్టులో నలుగురి అరెస్ట్

శంషాబాద్, వెలుగు : ఎయిర్​పోర్టులో గత రెండ్రోజుల్లో భారీగా బంగారం పట్టుబడింది. గత నెల 30, 31 తేదీల్లో నలుగురి ప్యాసింజర్ల నుంచి సుమారు 4 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  గత నెల 30న దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టుకు వచ్చిన ఓ మహిళా ప్యాసింజర్ ఇన్నర్ వేర్​లో 14 గోల్డ్ బిస్కెట్లను(1600 గ్రాములు) దాచి తీసుకొచ్చింది. స్కానింగ్​లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 14 గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు  రూ. కోటి 3 లక్షల 63 వేల 200 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గత నెల 31న ఓ ప్యాసింజర్ నుంచి రూ.69 లక్షల 85 వేల విలువైన 1,100 గ్రాములు, మరో ఇద్దరు మహిళా ప్యాసింజర్ల నుంచి రూ. కోటి 18 లక్షల 44 వేల 20 విలువైన 1865.2 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండ్రోజుల్లో నలుగురు ప్యాసింజర్ల నుంచి 4 కిలోల 590 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్ల 91 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.