అమెరికాలో ఒక్కరోజే 70 వేల కేసులు..

అమెరికాలో ఒక్కరోజే 70 వేల కేసులు..
  •     పెరిగిన డెల్టా వేరియంట్ వ్యాప్తి
  •     వ్యాక్సిన్​ వేసుకోనోళ్లకే ఎక్కువ

న్యూయార్క్: అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా వైరస్​ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో దాదాపు సగం జనాభా వ్యాక్సిన్​ వేసుకున్నారు. అయినా వైరస్​ కేసులు పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే దేశంలో 70 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని జాన్​ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో కేసులు పెరుగుతున్నాయని, ఇప్పుడు కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమంది టీకా వేసుకోని వాళ్లేనని అధికారులు చెబుతున్నారు. కేసులు తగ్గడంతో గతంలో ఎత్తేసిన ఆంక్షలను పలు రాష్ట్రాలు మళ్లీ అమలులోకి తీసుకొస్తున్నాయి. వ్యాక్సిన్​ రెండు డోసులు వేయించుకున్నోళ్లు మాస్క్​ వేసుకోనక్కర్లేదన్న రూల్​ను సవరించాయి. బహిరంగ ప్రదేశాలతో పాటు ఇండ్లల్లో కూడా మాస్క్​ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. కరోనా టెస్టులకు జారీ చేసిన గైడ్​లైన్స్​ను కూడా సెంటర్స్ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్(సీడీసీ) రివైజ్​ చేసింది. వ్యాక్సిన్​ రెండు డోసులు వేసుకున్నోళ్లు కరోనా పేషెంట్​తో క్లోజ్ కాంటాక్ట్​ అయితే వైరస్​ లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని గతంలో సూచించిన సీడీసీ.. తాజాగా దానిని సవరించి, లక్షణాలు ఉన్నా లేకున్నా సరే వైరస్ బాధితుడితో క్లోజ్​ కాంటాక్ట్​ అయితే మూడు నుంచి ఐదు రోజుల్లోపల టెస్టు చేయించుకోవాలని చెప్పింది.

డైలీ కేసులు యూఎస్​లోనే ఎక్కువ..

రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నది అమెరికాలోనే.. తర్వాత ఇండోనేషియా, ఇండియాలలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికాలో ఒక్కరోజే 70,740 మంది వైరస్​ బారిన పడగా.. 462 మంది కరోనాతో చనిపోయారని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్​ నెమ్మదిగా జరుగుతోంది. 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో 3,95,489 మంది కరోనా వ్యాక్సిన్​వేసుకున్నారు. జులై 28 నాటికి అమెరికాలో 133.3 మిలియన్ల జనాభాకు వ్యాక్సిన్ రెండు డోసులు​వేసినట్లు అధికారులు చెప్పారు. దేశ జనాభాలో ఇది దాదాపు సగమని వివరించారు.