వాటర్ క్యాన్లకుపెరిగిన గిరాకీ.. డైలీ 8 లక్షలకు పైగా అమ్ముడుపోతున్నయ్

వాటర్ క్యాన్లకుపెరిగిన గిరాకీ.. డైలీ 8 లక్షలకు పైగా అమ్ముడుపోతున్నయ్

హైదరాబాద్, వెలుగు:  ఎండలు మండిపోతున్నాయి. దీంతో మంచినీళ్లకు డిమాండ్​ బాగా పెరిగిపోయింది. సిటీతో పాటు శివారు మున్సిపాలిటీల్లో డైలీ 8 లక్షలకు పైగా వాటర్ కాన్లు అమ్ముడవుతున్నాయి. ఆర్థిక పరిస్థితిని బట్టి కొందరు ప్లాంట్లు, షాపుల వద్ద కొంటుండగా.. ఆపార్టుమెంట్లు, విల్లాల్లో ఉండేవారు బ్రాండెడ్ వాటర్ క్యాన్లని వాడుతున్నారు. ఇలా మంచి నీటి కోసం గ్రేటర్​తో పాటు శివారు మున్సిపాలిటీల్లోనూ జనం డైలీ దాదాపు రూ.4 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.

10 లక్షల కుటుంబాలు

గ్రేటర్​తో పాటు శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 30 లక్షలకు పైగా  కుటుంబాలు ఉండగా..  ఇందులో  10 లక్షల కుటుంబాలు ప్యూరిఫైర్ మెషీన్ల నీటితో పాటు వాటర్ క్యాన్ల నీటిని వాడుతున్నాయి. నార్మల్​వాటర్​ క్యాన్లకు ఏరియాలను బట్టి రూ.15 నుంచి 40 వరకు ఉండగా, బ్రాండెడ్ క్యాన్ ను రూ.100కు పైగానే అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాటర్​బోర్డు అందించే వాటర్ కనెక్షన్లు లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో సరిగ్గా సప్లయ్ కాకపోవడం, రాత్రి వేళల్లో వస్తుండటం, కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో జనం తాగు నీటిని కొనుక్కుంటున్నారు. సమ్మర్ కావడంతో ఈ ​నీటికి మరింత డిమాండ్ ఏర్పడింది. కొందరు ఆటోలకు వాటర్ ట్యాంకర్లని ఏర్పాటు చేసి నేరుగా కాలనీల్లోకి వచ్చి క్యాన్లలో పోసి వెళ్తున్నారు.

రేట్లు పెరిగినయ్..

వాటర్​బోర్డు పరిధిలో 10 వేలకు పైగా మినరల్​వాటర్ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా. అయితే, కరెంటు బిల్లుల రేట్లు పెరిగిపోవడంతో ప్లాంట్ల నిర్వాహకులు కూడా వాటర్ ​క్యాన్ల రేట్లను పెంచేశారు. 20 లీటర్ల క్యాన్ ధర గతంలో రూ.10 నుంచి 30 ఉండగా.. ఇప్పుడు పెంచేశారు. హోమ్ డెలివరీ అయితే  ఏరియాని బట్టి రూ.25 నుంచి రూ.45 వరకు తీసుకుంటున్నారు. పేరొందిన కంపెనీల నీటికి కూడా అదే తరహాలో డిమాండ్ ఉంది. 20 లీటర్ల క్యాన్ రూ.85 నుంచి రూ.150  వరకు అమ్ముతున్నారు. బ్రాండెడ్ నీటితోపాటు వాటర్ ఫ్లాంట్లలో డైలీ దాదాపుగా 8 లక్షలకుపైగా వాటర్ క్యాన్లను జనం కొంటున్నారు.

ఆదాయమే టార్గెట్ గా ప్లాంట్లు

ప్రజల అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకున్న వ్యాపారులు ఇష్టమొచ్చినట్లుగా వాటర్‌‌‌‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆదాయమే లక్ష్యంగా కనీస ప్రమాణాలు పాటించకుండా ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మినరల్‌‌‌‌ వాటర్‌‌‌‌ పేరుతో మినరల్​ లేకుండానే అమ్ముతూ కోట్లు వెనుకేసుకుంటున్నారు. వాల్టా చట్టం ప్రకారం వాటర్ ఫ్లాంట్​ఏర్పాటు చేసేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉండగా.. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టా రీతిన ఏర్పాటు చేసుకుంటున్నారు.  

వాటర్ కనెక్షన్లు లేవు


వాటర్​బోర్డు అందించే నీటి కనెక్షన్లు లేవు. దీంతో వాడేందుకు బోర్ నీళ్లు, తాగేందుకు మినరల్ వాటర్ వినియోగిస్తున్నం. కొద్ది రోజులు వాటర్ ప్యూరిఫైర్ వాడినం. కానీ అది ట్రబుల్ ఇస్తుండటంతో మినరల్ వాటర్ కొంటున్నం.

- సాయి గణేశ్, బండ్లగూడ జాగీర్

డైలీ నీటిని కొంటున్నం

వాటర్​బోర్డు అందించే వాటర్ ఏ సమయంలో వస్తున్నయో తెలుస్తలేదు. దీంతో తాగేందుకు నీటిని బయట కొంటున్నం. మినరల్ వాటర్ కోసం రోజుకు రూ.30 ఖర్చవుతోంది.
- మల్లేశ్, లంగర్ హౌస్