అర్ధరాత్రి చీకటి ఒప్పందం ఏంటి? : హరీశ్ రావు

అర్ధరాత్రి చీకటి ఒప్పందం ఏంటి? :  హరీశ్ రావు
  • బనకచర్లపై మీటింగ్​కు వెళ్లనని రాత్రికి రాత్రే ఎలా వెళ్లారు?: హరీశ్​ రావు
  • ఏపీ మంత్రి బనకచర్లపై చర్చించినం అంటున్నడు.. చర్చకు రాలేదని రేవంత్ ​అంటున్నరు
  • కేంద్ర సంస్థలు ప్రాజెక్టును తిరస్కరించినప్పుడు కేంద్రం మీటింగ్​ ఎట్లా పెట్టిందని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: బనకచర్లపై చంద్రబాబు మీటింగ్ పెడితే.. ఢిల్లీకి వెళ్లబోమని చెప్పిన సీఎం రేవంత్​రెడ్డి రాత్రికిరాత్రే ఢిల్లీ ఎందుకు పోయారని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంటని నిలదీశారు. గతంలోనూ నీతి ఆయోగ్​మీటింగ్​కు వెళ్లను అని అసెంబ్లీలో చెప్పి.. ఆ తర్వాత మీటింగ్​కు హాజరయ్యారన్నారు. బుధవారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. బనకచర్ల అంశం ఎజెండాలో లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి బుకాయించారని.. కానీ, అజెండాలోని మొదటి అంశమే పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్​ అని అన్నారు. కానీ, ప్రెస్​మీట్​లో సీఎం రేవంత్​ పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. ‘‘ఏపీ మంత్రి నిమ్మల గారేమో బనకచర్ల పై చర్చించాం అంటడు. 

పరిష్కారం కోసం కమిటీ వేశాం అంటున్నరు. రేవంత్ రెడ్డి ఏమో బనకచర్ల చర్చ రాలేదు అంటడు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడవచ్చునా? ఏపీకి, చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లించేందుకు ప్రజలు నిన్ను ఎన్నుకోలేదు. అబద్దాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి. పక్కనున్న ఉత్తమ్ కూడా అలాగే చేస్తున్నడు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు, బీజేపీ, టీడీపీ రిమోట్ పాలన. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ లో టీడీపీ కోవర్టులు ఉన్నారన్నరు’’ అని హరీశ్​అన్నారు. 

బనకచర్లపై కమిటీకి రేవంత్​ఎలా ఒప్పుకున్నరు?

బనకచర్లపై కమిటీ వేసేందుకు సీఎం రేవంత్​ రెడ్డి ఎలా ఒప్పుకుంటారని హరీశ్​ రావు ప్రశ్నించారు. రాష్ట్రానికి నష్టం జరిగితే పోరాటం చేస్తామని, సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పాల్సింది పోయి.. కమిటీకి ఒప్పుకుంటారా? అని నిలదీశారు. అసలు బనకచర్లపై కేంద్రం మీటింగ్​పెట్టడమే తప్పు అని అన్నారు. ‘‘సెంట్రల్ వాటర్ కమిషన్, జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీలు బనకచర్ల ప్రీ ఫీజబులిటి రిపోర్టును తిరస్కరించాయి. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థలు నిర్ద్వంద్వంగా అనుమతులు తిరస్కరించాయి. 

కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించాక కేంద్రం ఎలా మీటింగ్ పెట్టింది? రాష్ట్ర విభజన చట్టం, జీఆర్ఎంబీ, అపెక్స్ అనుమతి ఇవ్వకుండా బనకచర్లను రిటర్న్ కొడితే, దానికి రేవంత్ రెడ్డి నేడు కమిటీపై సంతకం పెట్టడం ఏమిటి. రేవంత్ తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఇది. కేసీఆర్, బీఆర్ఎస్ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదు. అపెక్స్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఇంటర్నల్ మీటింగ్ పెడితే ఎందుకు వెళ్లిండు? బాబు, బీజేపీతో ఉన్న బాయి బాయి రాజకీయాలపై, ఒప్పందాలపై రేవంత్ సమాధానం చెప్పాలి. బనకచర్ల ప్రాజెక్టుకు బీఆర్​ఎస్​ పార్టీ ఒప్పుకోబోదు. కేసీఆర్​ నేతృత్వంలో పోరాటం చేస్తాం’’ అని హరీశ్​రావు పేర్కొన్నారు.