ద్రవిడ పార్టీల చుట్టే తమిళ రాజకీయాలు!

ద్రవిడ పార్టీల చుట్టే తమిళ రాజకీయాలు!

గొప్ప ఫ్రెంచ్ రచయిత జీన్ కర్ 1849లో చెప్పినట్టు  ‘కొన్ని విషయాలు చాలా మారినా.. మరికొన్ని విషయాలు యథాతథంగా అవి నిరంతరం అలాగే కొనసాగుతాయి’. ఇది తమిళనాడుకు చాలా వర్తిస్తుంది. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత కూడా అదే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అక్కడే ఉన్నారు. భారతదేశంలో 1937లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మొదటి రాష్ట్రం తమిళనాడు. కాబట్టి, దేశరాజకీయాల్లో తమిళనాడు చాలా ప్రత్యేకమైనది.  రాజగోపాల్‌‌చారి  మద్రాస్  రాష్ట్రానికి మొదటి  ముఖ్యమంత్రి అయ్యారు. నిజాం హైదరాబాద్, అదేవిధంగా మైసూర్ రాష్ట్రం తప్ప దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం అప్పటి మద్రాస్ రాష్ట్రం  పరిధిలోనే ఉండేది. 

1967 నుంచి  ప్రధానంగా డీఎంకే,  ఏఐడీఎంకే పార్టీలు మాత్రమే  తమిళనాడును పాలించాయి.  ఈ  రెండు రాజకీయ  పార్టీలు అధికారాన్ని  చేజిక్కించుకోవడం కోసం మిత్రపక్షాలకు చెందిన పార్టీలపై ఆధారపడినప్పటికీ వ్యూహాత్మకంగా రాజకీయాలు చేశాయి.  ఎప్పుడూ  కూటమి భాగస్వాములకు చెందిన పార్టీల నుంచి  మంత్రులను  తీసుకోకుండా చూసుకున్నాయి. తద్వారా మిత్రపక్షాలకు చెందిన పార్టీలను ఎదగకుండా తమపై ఆధారపడేవిధంగా బలహీనంగా ఉంచాయి.  

తమిళనాడులో  ఒకేపార్టీ వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా అరుదు. 1984లో ఎంజీఆర్​ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2016లో జయలలిత  కూడా  వరుసగా  రెండో  పర్యాయం తమిళనాడు  ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.  ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా రెండో పర్యాయం అధికారం పొందాలంటే అతని అపోజిషన్​ పార్టీలు సఖ్యత కంటే భేదాభిప్రాయాలతో విభజనకు గురవ్వాలి. 

దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషించే కాంగ్రెస్  పార్టీ 1967 నుంచి తమిళనాడులో అధికారానికి దూరంగా ఉంది.  అప్పటి నుంచి తమిళనాడులో కొన్ని సీట్లు  పొందడానికి కూడా మిత్రపక్షాల పొత్తులపై ఆధారపడి ఉంటుంది. తమిళనాడు ఓటర్లలో అత్యధిక సంఖ్యలో  హిందువులే  ఓటర్లుగా ఉన్నా..మైనారిటీ వర్గాలైన ముస్లింలు,  క్రైస్తవులు దాదాపు 20 శాతం ఓటర్లుగా ఉన్నారు. తమిళనాడులో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే వీరి సహకారం కూడా కీలకమవుతుంది. 

భాష,  మతపరమైన వివాదాలు 

1967లో  హిందీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల కారణంగా డీఎంకే అధికారాన్ని పొందింది. కానీ, ఇప్పుడు  రాజకీయాలు మారిపోయాయి. ఎన్నికల్లో  గెలవాలంటే  కేవలం భాషాపరమైన  సమస్యలనే ప్రధాన ఎజెండాగా తీసుకుంటే సరిపోదు.  మతపరమైన సమస్యల గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది. కానీ, 1920 నుంచే తమిళనాడులో ఇటువంటి సమస్యలు ఉన్నాయి.  తమిళనాడులో బ్రిటిష్ వారు 1920లోనే  ఇటువంటి సమస్యలను ప్రోత్సహించారు.  ముఖ్యమంత్రి జయలలిత బహిరంగంగా చాలా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలు ఆమెను ఎన్నికలలో గెలవకుండా ఆపలేకపోయాయి. 

తమిళనాడు చరిత్ర 

బ్రిటిష్ వారు  భారతదేశ స్వాతంత్ర్యం ముందు 1858  నుంచే  మద్రాస్ స్టేట్​ (ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం)ను పాలించడం ప్రారంభించారు.  తెలంగాణలో 1947 వరకు  నిజాం పాలన ఉంది. ఈ రెండు ప్రాంతాలకు అదే పెద్ద తేడా.  బ్రిటిష్ వారు తాము పాలించిన  ప్రతిచోట వ్యూహాత్మకంగా వ్యవహరించేవారు. తమ పాలనలో  స్థానిక నాయకత్వాన్ని అణచివేతకు గురిచేశారు. 

బ్రిటిష్​ పాలకులకు 1920 నుంచి  భారతదేశంలో కాంగ్రెస్​ పార్టీ,  మహాత్మా గాంధీ వారి ప్రధాన ప్రతిపక్షం కాబట్టి, తమిళనాడుతోపాటు ఇతర ప్రాంతాలలో బ్రిటిష్ వారు ‘డివైడ్​ అండ్​ రూల్​’  అనే వ్యూహాన్ని ముందుకు తెచ్చారు.   కానీ,   నిజాం  పాలనలోని హైదరాబాద్ అదేవిధంగా  రాజస్తాన్, మధ్యప్రదేశ్ వంటి రాచరిక పాలనలో ఉన్న రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోలేదు. అందుకే, మన దేశం రెండు  ఇండియాలుగా ఉండేది.  ఒకటి   బ్రిటిష్  పాలనలో ఉన్న ఇండియా, రెండోది రాచరిక పాలనలో ఉన్న ఇండియా.  భారతదేశంలోని  రాచరిక పాలకులు తమ పాలనకు అంతరాయం కలగకుండా ప్రజల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు  ప్రయత్నించారు.

స్టాలిన్ భవిష్యత్తు

తమిళనాడు  ముఖ్యమంత్రి స్టాలిన్ నిశ్శబ్ద, వ్యూహాత్మక  రాజకీయ నాయకుడు.  ఎల్లప్పుడూ రాజీపడాలని కోరుకుంటాడు. దక్షిణాదికి డీలిమిటేషన్ ద్వారా అన్యాయం,  పార్లమెంటు సభ్యుల  సీట్ల నష్టం అనే అంశాన్ని స్టాలిన్  లేవనెత్తాడు.  దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రధాన జాతీయ సమస్యగా మారింది. స్టాలిన్ తక్కువగా మాట్లాడినప్పటికీ, అవసరమైనప్పుడు ఆయన వాగ్ధాటితో ప్రత్యర్థులపై  తీవ్రంగా దాడి చేస్తాడు.

 స్టాలిన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడు.  ప్రత్యర్థులతో ఘర్షణకు ప్రాధాన్యమివ్వడు.  కరుణానిధి లేదా జయలలిత మాదిరిగా  స్టాలిన్‌‌కు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. తమిళనాడు సీఎంగా స్టాలిన్ ఇప్పటివరకూ ప్రజలకు సహేతుకమైన మంచి పాలనను అందించాడు. ఏఐడీఎంకే  కూటమికి మరి కొంతమంది భాగస్వాములు లభిస్తారా చూడాలి. తమిళనాడులో ప్రతిపక్షాలు ఇప్పుడు ఉన్నట్లుగా వేర్వేరుగానే ఎన్నికల బరిలోకి దిగితే  2016లో జయలలిత గెలిచినట్లుగానే స్టాలిన్  మళ్లీ గెలిచే అవకాశం ఉంది.

అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి అవకాశాలు

2016లో జయలలిత మరణించిన తర్వాత  అన్నాడీఎంకేకి మాజీ ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి నాయకత్వం వహిస్తున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే  రెండు పార్టీలు విడివిడిగా పోటీచేసి  ఎంపీ సీట్లను కోల్పోయాయి. 

ఇప్పుడు  అన్నాడీఎంకే, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. కానీ, అది గెలిచేందుకు సరిపోదు.  ప్రముఖ నటుడు విజయ్ ఆకస్మికంగా తమిళనాట రాజకీయరంగ ప్రవేశం చేయడంతో  ప్రతిపక్షాల ఓట్లు  చీలతాయని అన్నాడీఎంకే–బీజేపీ కూటమి భావిస్తోంది. విజయ్ పార్టీ డీఎంకే వ్యతిరేక కూటమిలో చేరకపోతే  స్టాలిన్‌‌ గెలుపు ఆపడం సులభం కాదు. 

 ఉచితాలు లెక్కలోకి రావు! 

భారతదేశంలో ప్రతిదీ ఉచితం అనే సంస్కృతిని తమిళనాడు ప్రారంభించింది. కానీ, తమిళ ఓటర్లు మంచి పాలనను  కోరుతూ ఒక పార్టీ పదవీకాలం తర్వాత  ప్రభుత్వాలను తరిమికొట్టారు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఒక పాఠం.  ఉచితంగా ఇచ్చే ప్రతిదీ అధికారం నిలబెట్టుకోవడానికి పనిచేయదు. 

కామరాజ్ నాడార్ 1954 నుంచి  1963 వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.  కామరాజ్‌‌కు కుటుంబం, బ్యాంకు ఖాతా లేదు. నెహ్రూ కాలంలో కామరాజ్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. ఇందిరా గాంధీతో సహా ముగ్గురిని  ప్రధానులుగా చేశాడు. కామరాజ్‌‌ను  నేటికీ తమిళనాడు ఎంతో  గౌరవంగా స్మరించుకుంటుంది. తమిళనాడు తమ రాజకీయ నాయకుల నుంచి కేవలం నగదు మాత్రమే కాకుండా మరిన్ని ఆశిస్తుంది.  

మాజీ ముఖ్యమంత్రులు రాజాజీ, కామరాజ్, అన్నాదురై (డీఎంకే వ్యవస్థాపకుడు), ఎంజీఆర్​, జయలలిత తమ కుటుంబ రాజకీయ వారసులను అందించలేదు. కరుణానిధి మాత్రమే స్టాలిన్‌‌ను తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా చేశారు. తమిళనాడు ఎన్నికలకు దాదాపు 10 నెలల సమయం ఉంది. కామరాజ్ నాడార్ ప్రతిదానికీ గొప్ప సమాధానం చెప్పాడు. అదేంటంటే.. ‘పాకలం’ అంటే  ‘వేచి చూద్దాం’. మొత్తం మీద  స్టాలిన్​ గెలుపు అనేది ఏఐడిఎంకే కూటమి బలమూ, బలహీనతలపై అధారపడి ఉండనుంది! ఇంకా చెప్పాలంటే, ద్రవిడ పార్టీల చుట్టే తమిళ రాజకీయాలంటే బాగుంటుంది!

తమిళనాడులో మోదీ ప్రభావం!

తమిళనాడులో  భారతీయ జనతా పార్టీ  మెరుగైన వృద్ధి చెందిందనడంలో  సందేహం లేదు. నరేంద్ర మోదీ ప్రజాదరణ పొందిన నాయకుడు. కానీ,  బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఇతర హిందీ రాష్ట్రాల్లో కూడా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి 40 సంవత్సరాలు పట్టింది. ఎన్నికల్లో కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్  సహాయపడుతుంది.

డీఎంకే, అన్నాడీఎంకే  రెండూ ఇంకా ఒకే  తరహాలో పాత రాజకీయాలను అవలంబిస్తున్నాయి.  చాలామంది యువ ఓటర్లు పాలనాపరమైన మార్పును  కోరుకుంటున్నారు. వంశపారంపర్య రాజకీయాలు,  రాచరిక తరహా అధికార పాలన  పోవాలని కోరుకుంటున్నారు. 1967 నుంచి తమిళనాడు ఓటర్లకు డీఎంకే, అన్నాడీఎంకే తప్ప వేరే మార్గం లేదు.  ఇప్పుడు కొత్త  ఆప్షన్లు తెరుచుకుంటున్నాయి.  బీజేపీ బలపడుతోంది. కానీ  ఆ పార్టీ ఆశించినంత వేగంగా తమిళ
నాడులో అధికారం చేపట్టే అవకాశం లేదు. 

- డా.పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్​-