అవయవ దానం చేస్తున్న వారిలో మహిళల సంఖ్యే ఎక్కువ

అవయవ దానం చేస్తున్న వారిలో మహిళల సంఖ్యే ఎక్కువ
  • 80 శాతానికి పైగా వాళ్లే ఇస్తున్నరు
  • అయినోళ్లను కాపాడుకునేందుకు ముందుకు

హైదరాబాద్, వెలుగు: అవయవ దానం చేస్తున్న వారిలో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా లైవ్ ఆర్గాన్ డోనర్స్​లో 80% పైగా మహిళలే ఉంటున్నారు. కుటుంబ సభ్యులు, అయినోళ్ల ప్రాణాలు కాపాడుకునేందుకు అవయవ దానం చేస్తున్నారు. గతంతో పోలిస్తే అవయవ దానంపై అవగాహన పెరగడంతో ముందుకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇచ్చేవారిలో 80% మహిళలుంటే, తీసుకునేవారిలో 80% మగవారు ఉంటున్నారు. తండ్రి, భర్త, అన్న, తమ్ముడు, కొడుకు కోసం ఆర్గాన్ డొనేట్ చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. ఇంటిపెద్దకు ఏం కాకూడదని భార్య.. కొడుకు బతకాలని తల్లి.. అన్న బాగుండాలని చెల్లి ఇలా అయినోళ్లను కాపాడుకునేందుకు మహిళలు తాపత్రయపడుతున్నారు. మగవాళ్లు ఆర్గాన్ డొనేట్ చేసేందుకు ఆలోచిస్తారు.. కానీ మహిళలు సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌తో దానం చేసేందుకు ముందుకు వస్తున్నారని డాక్టర్లు అంటున్నారు. ఇందులో తల్లులు ఎక్కువగా ఉంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు మగవారి నుంచి ఆర్గాన్స్ తీసుకునేందుకు ఆడవాళ్లు ఒప్పుకోవడంలేదు. కుటుంబ భారం మోసే వాళ్లు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో మహిళలు ఇందుకు ఒప్పుకోవడం లేదని డాక్టర్లు చెప్తున్నారు.

లైవ్ అయితే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని

బ్రెయిన్ డెడ్, చనిపోయిన వారి నుంచి ఆర్గాన్​డొనేషన్ అధికసంఖ్యలో ఉంటున్నప్పటికీ... కొన్ని కేసుల్లో లైవ్ ఆర్గాన్ అయితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సమయంలో కుటుంబసభ్యులు, బంధువులను సంప్రదిస్తున్నారు. వీరిలో తమ బిడ్డను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తల్లులు ఎక్కువగా ముందుకు వస్తున్నారని, వారికి పునర్జన్మ ఇచ్చినట్లు భావిస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ‘‘జనవరి నుంచి ఇప్పటివరకు మా ఆస్పత్రిలో 20 లైవ్ ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్లు జరిగితే వాటిలో అవయవదానం చేసింది 15మంది మహిళలే. గతంతో పోలిస్తే అవయవదానం చేస్తున్న మహిళల శాతం పెరుగుతూ వస్తోంది” అని యశోద హాస్పిటల్​లో పనిచేసే డాక్టర్ పీ స్వామి తెలిపారు.

అమ్మ ఇచ్చిన పునర్జన్మ 

హైదరాబాద్​కు చెందిన 38 ఏండ్ల నవీన్​కు డయాబెటిస్​తో రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు. క్రమంగా బ్లడ్ ప్రెజర్ తగ్గిపోయి ఎనీమియా బారినపడ్డారు. దీంతో ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంట్ చేయాలని డాక్టర్లు సూచించారు. మొదట జీవన్‌‌‌‌‌‌‌‌దాన్ లో సంప్రదించారు. లైవ్ ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ అయితే మంచిదని డాక్టర్లు చెప్పడంతో తల్లి, భార్య, చెల్లి కిడ్నీ సరిపోతుందని తెలిసింది. తల్లి కిడ్నీ అయితే మంచిదని డాక్టర్లు చెప్పడంతో ఆమె తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే కొడుకు ఆరోగ్యం కారణంగా ఆమెకు షుగర్ పెరిగిపోవడంతో డాక్టర్లు నో చెప్పారు. ఆమె రెండునెలలు నాచురోపతి తీసుకుని బరువు తగ్గి కిడ్నీ ఇచ్చారు. గత నెలాఖరున కిడ్నీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ చేశారు.

మా అమ్మ నుంచి..

నేను 18 ఏండ్ల నుంచి టైప్‌‌‌‌‌‌‌‌1 డయాబెటిస్ తో బాధపడుతున్న. నా రెండు కిడ్నీలు చెడిపోవడంతో గతేడాది ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లో డయాలసిస్ మొదలుపెట్టాను. దాంతో ఇతర సమస్యలు పెరిగిపోయాయి. డాక్టర్లు ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ సూచించారు. మొదట జీవన్‌‌‌‌‌‌‌‌దాన్‌‌‌‌‌‌‌‌లో ప్రయత్నించాం. లైవ్ ఆర్గాన్ అయితే మంచిదని డాక్టర్లు చెప్పడంతో మా కుటుంబసభ్యుల్లో ట్రై చేశాం. అమ్మదైతే ఇంకా మంచిదని అన్నారు. అలా అమ్మకి హెల్త్ చెకప్ చేయించి జులై 22న తన నుంచి కిడ్నీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంట్ చేశారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారు. ఇది నాకు మా అమ్మ ఇచ్చిన మరో జన్మలా భావిస్తున్న.

- రాజశేఖర్, ప్రైవేట్ ఎంప్లాయ్, అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్