
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. బీజేపీపై మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తు న్నారని, వాటిని నమ్మొద్దని ప్రజలను కోరారు. గురువారం హైదరాబాద్‌లో బీజేపీ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.
దీనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, అభ్యర్థి దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఎంఐఎం గూండాల అనుమతితో నగరంలో బతకాల్సిన పరిస్థితి రావొద్దంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.
ఈ ఎన్నికల్లో కన్నీ ళ్లతో ఒకరు.. కట్టెలతో ఒకరు ప్రచారం చేస్తు న్నారని చెప్పారు. కన్నీళ్లకు కరిగినా.. కట్టెల కు భయపడినా భాగ్యనగరం భవిష్యత్ మూసీ లో కలవాల్సిన పరిస్థితి వస్తదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పు డు సర్వేలు వస్తున్నాయని, ఆ సర్వేలు ఎవరు చేశారు..
ఏసీ రూంలలో కూర్చుని చేశారా? అని ప్రశ్నించారు. పార్టీల వద్ద జీతం తీసుకొని పనిచేసే వారు కూడా తమ రిక్వెస్ట్‌ను అప్పీల్‌గా స్వీకరించాలని కోరారు. తమ పార్టీని డ్యామేజ్ చేయాలనుకుని తప్పుడు వార్తలు, సర్వేలను గుర్తుపెట్టుకుంటామని స్పష్టం చేశారు.