బ్లాక్ మనీ లేదు : 2 వేల నోట్లన్నీ బ్యాంకులకు వచ్చేశాయ్

బ్లాక్ మనీ లేదు : 2 వేల నోట్లన్నీ బ్యాంకులకు వచ్చేశాయ్

చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని, రూ.10 వేల కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.  మే 19న రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయానికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు సర్క్యులేషన్‌లో ఉండగా.. అక్టోబర్‌ 31 నాటికి ఆ సంఖ్య 10వేల కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది.

రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు ముందుగా సెప్టెంబర్ 30 వరకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా మళ్లీ ఓ వారం రోజులు అంటే అక్టోబర్ 7 వరకు అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 7 తర్వాత కూడా ప్రజల వద్ద ఇంకా  రూ.12 వేల కోట్లు విలువైన రూ.2 వేల నోట్లు ఉన్నట్లుగా తెలుసుకున్న ఆర్బీఐ..  వాటిని మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 19  ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేసింది. 

ఈ క్రమంలో  పెద్ద సంఖ్యలో ప్రజలు ఆర్‌బీఐ ఆఫీసుల వద్ద క్యూ కడుతున్నారు. రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనినే  కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకు చెందిన వారిని క్యూలైన్లలో నిలుచుండబెట్టి డబ్బులను మార్చి ఇస్తున్నారు.  క్యూలైన్లలో నిలుచుని నోట్లను మార్చి ఇచ్చినందుకు రూ.300 నుంచి 400 వరకు ఛార్జ్ చేస్తున్నారు.