టీచర్ పోస్టులు సగానికి పైగా మహిళలకే

టీచర్ పోస్టులు సగానికి పైగా మహిళలకే
  • భర్తీ చేయనున్న జాబ్స్ 5,089..
  • ఇందులో మహిళలకు 2,589 పోస్టులు
  • సగం జిల్లాల్లో సబ్జెక్టు పోస్టుల్లేవ్.. ఉన్నచోట్ల సింగిల్ డిజిటే
  • హైదరాబాద్‌‌లోనే ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టులు
  • ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల వివరాలకు సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్‌‌ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ రిలీజ్ చేసింది. 33 జిల్లాల్లో కేటగిరీ, మేనేజ్‌‌మెంట్, మీడియం వారీగా పోస్టులు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ఖాళీలను వెల్లడించింది. భర్తీ చేయనున్న 5,089 టీచర్ పోస్టుల్లో సగానికి పైగా మహిళలకు కేటాయించారు. మహిళలకు 2,589 పోస్టులు, జనరల్ కేటగిరీలో 2,491 పోస్టులున్నాయి.

ఇయ్యాల్టి నుంచి డీఎస్సీ–2023 అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. వచ్చేనెల 21 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

తెలుగు మీడియంలో 3,842 పోస్టులు

5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఈనెల 6న విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంట్లో స్కూల్ అసిస్టెంట్ 1,739, ఎస్జీటీ 2,575, లాంగ్వేజీ పండిట్లు 611,  పీఈటీ పోస్టులు 164 ఉన్నాయి. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన రెండు వారాల తర్వాత డీటెయిల్డ్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఇందులో సగం జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులు లేవు. ఉన్న చోట సింగిల్ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి. దీంతో అభ్యర్థులంతా తీవ్ర అయోమయంలో ఉన్నారు.

Also Raed : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలి : హైకోర్టులో షేజల్ పిటిషన్

అత్యధికంగా తెలుగు మీడియంలో 3,842 పోస్టులున్నాయి. ఇంగ్లిష్ మీడియంలో ఎస్జీటీ కేటగిరీలో 40 పోస్టులుంటే, అవన్నీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉండటం గమనార్హం. మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో బయోలజీ, సోషల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి.

జిల్లాల్లో సింగిల్ డిజిటే

స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేవలం 1,739 ఉండటంతో.. చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ పోస్టులే వచ్చాయి. కొన్ని సామాజిక వర్గాలకు ఒక్క పోస్టు కూడా అలాట్ కాలేదు. 9 జిల్లాల్లో ఎస్​ఏ (మ్యాథ్స్) ఒక్క పోస్టు కూడా లేదు. మిగిలిన 24 జిల్లాల్లో ఒకటీ రెండు పోస్టులే ఉన్నాయి. 7 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులే లేవు. మిగిలిన జిల్లాల్లో ఒకటీ, రెండే పోస్టులున్నాయి. రెండు జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టులు లేవు. మిగిలిన అన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ పోస్టులే. లాంగ్వేజీ పండింట్ (హిందీ) ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క పోస్టు కూడా లేదు. 27 జిల్లాల్లో సింగిల్ డిజిట్ పోస్టులున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టులు అలాట్ అయ్యాయి. హనుమకొండ, వనపర్తి జిల్లాల్లో బీసీ–డీకి ఒక్క పోస్టులేదు. ఐదారు జిల్లాల్లో ఒక్కో పోస్టే ఉంది. స్పోర్ట్స్ కేటగిరీలో 18 జిల్లాల్లో ఒక్క పోస్టు లేదు. మరోవైపు ప్రస్తుతం కొత్త రోస్టర్ అమలు చేయడంతో ఒకటీ రెండు పోస్టులుంటే.. అవన్నీ మహిళలకే అలాట్ అయ్యాయి. రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సమయంలో ప్రభుత్వం వర్టికల్ విధానాన్ని అమలు చేస్తే.. జనరల్ కేటగిరీ పోస్టుల్లోనూ అమ్మాయిలు పోటీపడే అవకాశముంది. కానీ హారిజంటల్ విధానం అమలు చేస్తే జనరల్ కేటగిరీ పోస్టులన్నీ అబ్బాయిలకే అలాట్ చేయనున్నారు.

‘రిప్ డీఎస్సీ’ అంటూ పోస్టులు

ఆరేండ్ల తర్వాత వేసిన డీఎస్సీలో తక్కువ పోస్టులుండటంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘రిప్ డీఎస్సీ’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో కొన్ని సామాజిక వర్గాలకు ఒక్క పోస్టు కూడా లేకపోవడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్​లో పోస్టుల అంకెల కంటే సున్నాలే ఎక్కువగా ఉన్నాయని డీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకొని 13 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మీడియం వారీగా పోస్టులు

తెలుగు–3,842, ఉర్దూ–671, మరాఠీ–35,  బెంగాలీ–16, కన్నడ–12, ఇంగ్లిష్​–135, హిందీ –377, తమిళం –1.