
- ఇంకో ఏడాదిలో లక్ష పాయింట్లకు సెన్సెక్స్ .. మోర్గన్ స్టాన్లీ అంచనా
- సాధారణ పరిస్థితుల్లో 89 వేలకు
- బేర్ మార్కెట్‌లో 70 వేలకు పడొచ్చు
- కంట్రోల్లో ఇన్‌ఫ్లేషన్, కలిసిరానున్న ట్రేడ్ డీల్స్
న్యూఢిల్లీ: ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై ఫైనాన్షియల్ కంపెనీ మోర్గన్ స్టాన్లీ సానుకూలంగా ఉంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు మరింత ర్యాలీ చేస్తాయని అంచనా వేస్తోంది. కిందటేడాది సెప్టెంబర్‌లో నమోదైన గరిష్ఠాల నుంచి ఇండెక్స్‌లు పడిన విషయం తెలిసిందే. దీంతో కొనుగోలుకు అవకాశం దొరికిందని, వచ్చే ఏడాది జూన్ నాటికి సెన్సెక్స్ 89 వేలకు చేరుకుంటుందని తన మిడ్-ఇయర్ ఔట్‌లుక్‌లో పేర్కొంది.
ఇది సెన్సెక్స్ బుధవారం క్లోజింగ్ లెవెల్ 81,597 నుంచి 8 శాతం ఎక్కువ. బుల్ రన్ కొనసాగితే ఈ ఇండెక్స్ లక్షకు చేరొచ్చని కూడా అంచనా వేసింది. గ్లోబల్ అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారతదేశ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని వెల్లడించింది. ‘‘ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడం, వివిధ దేశాలతో ట్రేడ్ డీల్స్ కుదురుతుండడం, ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకొని, ఆదాయం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి.
ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుండడం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సపోర్ట్‌గా నిలవనుంది. ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకోవడం, వినియోగం పుంజుకోవడం, కార్పొరేట్ కంపెనీల రిజల్ట్స్ మెరుగవ్వడంతో ఇండియా ఎకానమీ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంది”అని మోర్గన్ స్టాన్లీ వివరించింది. సెన్సెక్స్ ఎర్నింగ్స్ పర్ షేర్ (ఈపీఎస్) అంచనాలను కొద్దిగా పెంచింది. బేస్ కేస్‌లో సెన్సెక్స్ ఎర్నింగ్స్ 2027–28 వరకు ఏటా 16.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
ఎఫ్‌ఐఐలు తిరిగొస్తున్నారు..
మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు (ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) ఇండియాపై అండర్‌వెయిట్ (కొనాలనుకోకపోవడం) లో ఉన్నారు. కానీ, ఈ మధ్య వీరు తిరిగి ఇండియన్ మార్కెట్‌లోకి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక డొమెస్టిక్ రిటైల్ పార్టిసిపేషన్ బలంగా ఉంది. ఈ ఏడాది ఎఫ్‌ఐఐలు వెళ్లిపోయినా, మార్కెట్ తట్టుకొని నిలబడడానికి వీరే కారణం.
ఇటీవల మార్కెట్ పడినప్పుడు కూడా వోలటాలిటీ కంట్రోల్‌లో ఉంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ బలంగా ఉందనే విషయం దీని ద్వారా తెలుస్తోంది. డిఫెన్సివ్స్, ఎగుమతి ఆధారిత సెక్టార్స్ కంటే డొమెస్టిక్ సైక్లికల్స్ (సీజన్ బట్టి సేల్స్ పెరిగే సెక్టార్లు) సెక్టార్లకు మొగ్గు చూపుతోంది. ఫైనాన్షియల్స్, కన్జూమర్ డిస్క్రిషనరీ, ఇండస్ట్రియల్స్‌పై ఓవర్‌వెయిట్‌లో (సానుకూలంగా) ఉంది.
ఎనర్జీ, మెటీరియల్స్, యుటిలిటీస్, హెల్త్‌కేర్‌పై అండర్‌వెయిట్‌లో ఉంది. బేస్ కేసులో సెన్సెక్స్ టార్గెట్ 89,000కి చేరుకుంటుంది. ఇందుకు 50 శాతం అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరలు నిలకడగా ఉండడం, యూఎస్ గ్రోత్ గాడిలో పడడం, ప్రభుత్వం బిజినెస్‌లను సపోర్ట్ చేసే పాలసీలు తేవడం కలిసి వస్తోంది. బుల్ రన్ ఉంటే, అంటే తక్కువ ఆయిల్ ధరలు, రేట్ల కోత, పాలసీ రిఫార్మ్స్ బలంగా ఉంటే ఇండెక్స్ లక్షకు చేరొచ్చు.
బేర్ మార్కెట్ ఉంటే, అంటే గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడం, క్రూడాయిల్ ధరలు పెరగడం వంటి పరిస్థితులు ఉంటే సెన్సెక్స్ 70 వేలకి పడొచ్చని అంచనా. బుల్ రన్ పరిస్థితుల్లో గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే ఇండియా తక్కువగా పెరగొచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండడంతో విదేశీ పెట్టుబడులు వస్తాయని అంచనా.