
బిజినెస్ డెస్క్, వెలుగు: అదానీ గ్రూప్ కంపెనీల్లో మెజార్టీ షేర్లు వరుసగా మూడో సెషన్‌లో కూడా భారీగా పడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు సోమవారం 20 శాతం నష్టపోగా గత ఐదు సెషన్లలో 40 శాతం క్రాష్ అయ్యింది. అదానీ టోటల్ గ్యాస్ కూడా సోమవారం 20 శాతం క్రాష్ అయ్యింది. గత ఐదు సెషన్లలో 41 శాతం పడింది. అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు సోమవారం 15 శాతం, గత ఐదు సెషన్లలో 37 శాతం నష్టపోయాయి. అదానీ పవర్, అదానీ విల్‌మార్, ఎన్‌డీటీవీ షేర్లు 5 శాతం చొప్పున నష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. గత ఐదు సెషన్లలో 15 శాతం వరకు క్రాష్ అయ్యాయి. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ షేర్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. గత ఐదు సెషన్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీల షేర్లు 25 శాతం వరకు నష్టపోయాయి. సోమవారం ఒక్క సెషన్‌లోనే అదానీ కంపెనీల ఇన్వెస్టర్లకు రూ.1.4 లక్షల కోట్ల లాస్ వచ్చింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత ఈ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5.9 లక్షల కోట్లు తగ్గింది.
రూ. 13.63 లక్షల కోట్లకు తగ్గిన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్..
హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత మూడు సెషన్లలోనే రూ.5.9 లక్షల కోట్లు తగ్గింది. రిపోర్ట్ రిలీజ్ కాకముందు ఈ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 19.6 లక్షల కోట్ల దగ్గర ఉండేది. తాజాగా రూ.13.63 లక్షల కోట్లకు తగ్గింది. గౌతమ్ అదానీ సంపద సుమారు 30 బిలియన్ డాలర్లు తగ్గి 92 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో ఆయన ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నారు..
అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్‌కు బైబ్యాక్ బూస్ట్!
బై బ్యాక్ ఉంటుందనే అంచనాలతో అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ షేర్లు సోమవారం లాభపడ్డాయి. ఈ రెండు కంపెనీల షేర్ల బై బ్యాక్ కోసం రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని అదానీ గ్రూప్ చూస్తోంది. ప్రస్తుతానికి చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఈ విషయంపై త్వరలో కంపెనీ బోర్డులు నిర్ణయం తీసుకుంటాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
ఎల్‌ఐసీ ఇన్వెస్ట్‌మెంట్ డబుల్
అదానీ గ్రూప్ షేర్లు గత మూడు సెషన్లలో భారీగా నష్టపోయినప్పటికీ ఈ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన తమ పెట్టుబడులు రెండింతలు లాభానిచ్చాయని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ప్రకటించింది. గత కొన్నేళ్లలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో రూ.30,127 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, ఈ నెల 27 నాటికి వాటి విలువ రూ.56,142 కోట్లకు పెరిగింది. ప్రస్తుతానికి అదానీ కంపెనీల్లో తమ ఇన్వెస్ట్‌మెంట్‌లు రూ.36,474 కోట్లుగా ఉన్నాయంది. తమ దగ్గర ఉన్న అదానీ గ్రూప్ బాండ్లన్నీ ఏఏ రేటింగ్‌వి అని పేర్కొంది. కాగా, వివిధ కంపెనీల్లో ఎల్‌ఐసీకి రూ.41.66 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వాటా 0.975 శాతమేనని ఎల్‌ఐసీ పేర్కొంది.
అదానీ ఎఫ్‌పీఓకి స్పందన కరువు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ తీసుకొచ్చిన రూ.20 వేల కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) రెండో రోజైన సోమవారం నాటికి 3 శాతం మాత్రమే సబ్‌స్క్రిప్షన్ సాధించింది. 4.55 కోట్ల షేర్లను ఎఫ్‌పీఓలో అమ్మకానికి ఉంచగా, ఈ పబ్లిక్ ఆఫర్ రెండో రోజు నాటికి 13,98,516 షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఎఫ్‌పీఓ ధర రూ.3,112– 3,276 కాగా, కంపెనీ షేర్లు సోమవారం రూ.2,870 దగ్గర క్లోజయ్యాయి. షేరు ధర తగ్గినా, కంపెనీ ఎఫ్‌పీఓ రేటును మార్చమని అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. ‘స్ట్రాటజిక్ , పెద్ద ఇన్వెస్టర్లకు ధర సమస్య కాదు. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి తగ్గొచ్చు. కానీ, ఎఫ్‌పీఓ ద్వారా లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లు, అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్, ఫ్యామిలీస్‌ను ఆకర్షించడానికి మాకు వీలుంటుంది’ అని అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేషిందర్ సింగ్ పేర్కొన్నారు. కాగా, హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అదానీ గ్రూప్‌లోని మిగిలిన కంపెనీల షేర్లు సోమవారం నష్టపోయినా అదానీ ఎంటర్‌ప్రైజెస్ మాత్రం 4 శాతం పెరిగింది.
జాతీయవాద జెండా వెనుక దాక్కుంటున్నారు
ఆరోపణలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా నేషనలిజం వెనుక అదానీ గ్రూప్ దాక్కుంటోందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. అదానీ గ్రూప్ విడుదల చేసిన 413 పేజీల రిపోర్ట్‌పై ఈ యూఎస్ కంపెనీ స్పందించింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయడం ఇండియాపై అటాక్ చేసినట్టు కాదని తెలిపింది. ఇండియా అతిపెద్ద డెమొక్రసి దేశమని, వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని నమ్ముతున్నామంది. అదానీ గ్రూప్ వలన ఇండియా ఫ్యూచర్‌కి అడ్డంకులు ఉన్నాయని కూడా నమ్ముతున్నామని చెప్పింది. పకడ్బందీగా మోసం చేస్తూ జాతీయవాద జెండా వెనుక అదానీ గ్రూప్ దాక్కుంటోందని ఆరోపించింది. ప్రపంచంలో అతిపెద్ద సంపన్నుడు చేసినా మోసం మోసమే అవుతుందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఫారిన్ ఎక్స్చేంజ్ చట్టాలను ఉల్లంఘించామని అదానీ గ్రూప్ చేసిన ఆరోపణలను ఈ సంస్థ తోసిపుచ్చింది. ఈ గ్రూప్ విడుదల చేసిన 413 పేజీల రిపోర్ట్‌లో కేవలం 30 పేజీల్లో మాత్రమే సంబంధిత అంశాలపై ఫోకస్ పెట్టారని పేర్కొంది. 330 పేజీల్లో అనవసరమైన విషయాలు ఉన్నాయంది. ఈ కంపెనీ ఎంతమంది మహిళా ఉద్యోగులను నియమించుకుంది, ఎంత దానం చేసిందనే విషయాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది.
అదానీ రెస్పాన్స్..
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై అదానీ గ్రూప్ ఘాటుగా రెస్పాండ్ అయ్యింది. మొత్తం 413 పేజీల రిపోర్ట్‌ను కంపెనీ విడుదల చేసింది. హిండెన్‌బర్గ్ చేస్తున్న స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్స్, కార్పొరేట్ గవర్నెన్స్‌లో లోపాల ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. హిండెన్‌బర్గ్ తమ కంపెనీల షేర్లను షార్ట్ సెల్లింగ్ చేసి, తప్పుడు పద్ధతిలో లాభాలు సంపాదించడానికి ఇలాంటి అర్థపర్ధం లేని రిపోర్ట్‌ను విడుదల చేసిందని అదానీ గ్రూప్ పేర్కొంది. షేర్లు నష్టపోయేలా చేసేందుకు, ఇన్వెస్టర్లను మానిప్యులేట్ చేసేందుకు ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసిందని ఆరోపించింది. దేశం, దేశంలోని కంపెనీలు సాధిస్తున్న వృద్ధిని చూసి ఓర్వలేకే హిండెన్‌బర్గ్ ఈ రిపోర్ట్ విడుదల చేసిందని పేర్కొంది. ఈ రిపోర్ట్‌పై హిండెన్‌బర్గ్ అంతే తీవ్రంగా స్పందించింది.