బిర్యానీ.. దోశ..బర్గర్ : ఆన్ లైన్ ఆర్డర్లలో అగ్రస్థానం వీటిదే

బిర్యానీ.. దోశ..బర్గర్ : ఆన్ లైన్ ఆర్డర్లలో అగ్రస్థానం వీటిదే

ఫస్ట్​ ప్లేస్ బిర్యానీ, నెక్ట్స్​ ప్లేస్ దోశ.. బర్గర్లదే

ఆన్​లైన్​లో నిమిషానికి 40కి పైగా బిర్యానీ బుకింగ్స్​

సెలవు రోజుల్లో భారీగా పెరుగుతున్న సంఖ్య

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ ఐకానిక్​ ఫుడ్​ బిర్యానీని భోజన ప్రియులు మస్తు లాగించేస్తున్నారు. ఆన్​లైన్​లో నిమిషానికి 40 ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రతి10 బుకింగ్స్​లో 6 నుంచి 10 బిర్యానీలే ఉంటున్నాయంటే ఏ రేంజ్​లో తింటున్నారో అర్థం చేసుకోవచ్చు. వీక్​డేస్​లో వన్​డేలో 6–7లక్షల ఆర్డర్లు వస్తుండగా వీకెండ్స్​లో ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. ప్రస్తుతం సిటీలో హోటళ్లు, రెస్టారెంట్లు ఇలా అన్నీ కలిపి 12 వేలకు పైనే ఉన్నాయి. దాదాపు 10వేల రెస్టారెంట్లలో మెయిన్ ఫుడ్ బిర్యానీనే. నాన్ వెజ్ ఐటమ్స్​లో చికెన్, మటన్, ఫిష్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువగా చికెన్ బిర్యానీ తింటున్నారని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు తెలిపారు.  బిర్యానీ తర్వాత జనం ఎక్కువగా తింటున్న వాటిలో దోశలు, బర్గర్లు ఉన్నాయి. ఓ ఆన్​లైన్ ​ఫుడ్ ​డెలివరీ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి.

పండుగ ఏదైనా, సందర్భం ఎలా ఉన్నా బిర్యానీ తినేందుకు నగర ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రాకతో బిర్యానీ సేల్స్ కు బూస్టింగ్ ఇవ్వగా, ఆ తర్వాతి స్థాయిలో దోశ, బర్గర్లు తినేందుకు జనం ఇష్టపడుతున్నారు. రోజూ లక్షల్లో బిర్యానీలు ఫుడ్డీల బొజ్జల్లోకి చేరుతుండగా, ప్రతి నిమిషానికి 40కి పైగా బిర్యానీలు ఆన్ లైన్ లో బుక్ అవుతున్నాయి.

ఆన్ లైన్ పుణ్యాన ఫుడ్ ఆర్డర్లు జోరందుకున్నాయి. ఏడాది కాలంగా అత్యధికంగా బిర్యానీ ఆర్డర్లు అవుతున్నాయి. హోటల్ కు వచ్చి తినేంత టైం లేకనో, ఇంటి ముందుకు వేడివేడి ఫుడ్ వచ్చే వీలుండటంతోనో ఎక్కువగా బిర్యానీనే బుక్ చేసుకుంటున్నారు. సిటీలో చిన్నాచితక వాటిని కలుపుకొని హోటళ్లు, రెస్టారెంట్లు మొత్తం 12 వేలకు పైనే ఉన్నాయి. ఇందులో కనీసం10 వేల రెస్టారెంట్లలో మెయిన్ ఫుడ్ బిర్యానీనే.  నాన్ వెజ్ బిర్యానీల్లో చికెన్, మటన్, ఫిష్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువగా చికెన్ బుకింగ్స్ వస్తున్నాయని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు తెలిపారు.

10 లో 8 బిర్యానీలే..

సిటీలో ప్రస్తుతం 50 నుంచి 60 వేల మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ పని చేస్తున్నారు. నాలుగు కంపెనీలు ప్రధానంగా ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఆన్ లైన్ లో బుకింగ్ అవుతూనే ఉంటున్నాయి. ప్రతిఒక్క డెలివరీ బాయ్ రోజులో సగటున ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ చేసిన దేశవ్యాప్త సర్వేలో ప్రతి నిమిషానికి 40కి పైగా బిర్యానీలు బుకింగ్ అవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో దోశ, బర్గర్లు ఉన్నాయని తేలింది. హైదరాబాద్ లో మాత్రం ప్రతి 10 బుకింగ్స్ లో 6  నుంచి 8 బిర్యానీలే ఉంటాయని సిటీకి చెందిన ఓ ఫుడ్ డెలివరీ కంపెనీ మేనేజర్ చెప్పారు.

టిఫిన్స్, స్నాక్స్

సాధారణ హోటళ్ల నుంచి మల్టీలెవల్ హోటళ్ల వరకు అన్నిచోట్ల టిఫిన్స్ లో దోశ కచ్చితంగా ఉంటుంది. స్విగ్గీ వెల్లడించిన సర్వేలో దోశకు దేశవ్యాప్తంగా రెండో స్థానం రాగా, హైదరాబాద్ లోనూ జోరుగానే ఆర్డర్లు అవుతున్నాయి. ప్రతి గల్లీలో దోశ బండ్లు ఉన్నప్పటికీ వెరైటీ రుచులను ఆస్వాదించేందుకు ఆన్ లైన్ బుకింగ్ ను ఆశ్రయిస్తున్నారు. రూ.20 నుంచి రూ.150 వరకు దొరికే పలు దోశలను బుకింగ్ అవుతున్నాయి. ఈ గిరాకీ ఉదయం 6 నుంచి 10 గంటల్లోపే ఉంటుందని ఓ డెలివరీ బాయ్ తెలిపారు. సాయంత్రం వేళ తినే స్నాక్సులలోనూ ఎక్కువగా దొరికే సమోసా, బజ్జీ లాంటివి కాకుండా బర్గర్లను బుక్ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎవరికి వారు స్పెషల్ ఆఫర్లను ప్రకటించడం, సగం రేటుకే ఇంటి ముందుకు వస్తుండటంతో ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు.

ఆఫర్లతో సేల్స్

ప్రతి ఫుడ్ డెలివరీ కంపెనీ తమతమ యాప్ , వెబ్ సైట్ల ద్వారా ఆహారపదార్థాలను బుక్ చేసుకుంటే ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నాయి. ఫుడ్​ని బట్టి కొన్ని కంపెనీలు ఆఫర్లనిస్తుంటే, మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లను బట్టి, ఇంకొన్ని బుకింగ్ మొత్తంపై 20–30శాతం లేదా కనీసం రూ.100 వరకు తగ్గింపు రేట్లు అంటూ డెలివరీ చేస్తున్నాయి. బిర్యానీ రేటు రూ.180 నుంచి రూ.220 వరకు ఉంది. ఆన్ లైన్ బుకింగ్ తో రూ. 120లకే బిర్యానీ వస్తుందని అందుకే బుకింగ్స్​పెరిగిపోతున్నాయని ఓ హోటల్ యజమాని చెప్పారు.

సెలవుల్లో మరింత క్రేజ్…

సాధారణ రోజులతో పోలిస్తే సెలవు రోజుల్లో ఫుడ్ ఆర్డర్లు మరింతగా పెరుగుతున్నాయి. సిటీలో ప్రతిరోజు కనీసం 6 నుంచి 7లక్షల బిర్యానీలు అమ్ముడవుతుండగా, సెలవు రోజుల్లో ముఖ్యంగా పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చే వీకెండ్ లో మరింత మరింత పెరుగుతున్నాయి. పార్టీలు, ఈవెంట్ల సందర్భాల్లోనూ ఎక్కువగా బిర్యానీ ఐటమ్స్ ఉంటున్నాయి.