కామన్వెల్త్లో ఇండియా ‘వెయిట్’ వాళ్లే

కామన్వెల్త్లో ఇండియా ‘వెయిట్’ వాళ్లే

బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్ లిప్టింగ్,బాక్సింగ్, బ్యాడ్మింటన్, లాన్ బౌల్స్ వంటి క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. ప్రపంచ వేదికపై ఝూళు విదల్చి..పతకాలను ఒడిసిపట్టుకున్నారు 75వ స్వాంతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ..కామన్వెల్త్ గేమ్స్లో మనోళ్లు పతకాలు సాధిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. 
 
ఆరో రోజు..పతకాల వేట..
బర్మింగ్‌హామ్‌లో  ఆరో రోజు భారత ప్లేయర్లు పతకాలను దక్కించుకున్నారు.  జూడోలో  తూలికా మాన్ మహిళల 78 కిలోల విభాగంలో రజతం సాధించింది. లవ్‌ప్రీత్ సింగ్, గుర్దీప్ సింగ్ వెయిట్ లిఫ్టింగ్ లో మెడల్స్ సొంతం చేసుకున్నారు. అటు స్వ్కాష్ లో  సౌరవ్ ఘోసల్ , పురుషుల హైజంప్ లో  తేజస్విన్ శంకర్ కాంస్య పతకాలను సాధించారు.  మహిళల 50 కేజీల లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ కూడా సెమీస్‌లోకి ప్రవేశించి పతకాన్ని ఖాయం చేసుకుంది. 

 

పతకాల పట్టికలో ఎన్నో స్థానం..
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఇప్పటి వరకు 18 పతకాలు సాధించింది. ఇందులో  ఐదు స్వర్ణ పతకాలు, 6 సిల్వర్, 8 బ్రౌంజ్ మెడల్స్ ఉన్నాయి. ఓవరాల్గా 18 పతకాలతో భారత్ 7వ ప్లేస్లో ఉంది. పతకాల జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ దేశం 46 గోల్డ్, 38 సిల్వర్, 39 బ్రౌంజ్ మెడల్స్తో టాప్ పొజిషన్లో ఉంది. 39 స్వర్ణం, 37 రజతం, 28 కాంస్య పతకాలతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత కెనడా 57 పతకాలతో మూడో స్థానంలో..న్యూజిలాండ్ 35 పతకాలతో నాల్గో స్థానంలో..స్కాట్లాండ్ 32 పతకాలతో టాప్ -5లో ఉన్నాయి. మొత్తంగా భారత్ 18 పతకాలతో టాప్ -10లో కొనసాగుతుండటం విశేషం. 

వెయిట్ లిఫ్టింగ్లో సత్తా..
కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు సాధించిన 18 పతకాల్లో వెయిట్ లిఫ్టర్లే ఎక్కువగా సాధించడం విశేషం. మొత్తంగా  మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో 10 పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. జూడోలో భారత్  రెండు సిల్వర్ మెడల్స్, ఒక కాంస్య పతకాన్ని  దక్కించుకుంది.టెబుల్ టెన్నిస్ లో గోల్డ్, లాన్ బౌల్స్ ఉమెన్స్ ఫోర్స్ లో మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరాయి. బ్యాడ్మింటన్ విభాగంలో సిల్వర్, స్వ్కాష్ లో బ్రౌంజ్ మెడల్, హై జంప్ లో మరో బ్రౌంజ్ మెడల్ దక్కింది.  

స్వర్ణ పతక వీరులు..
మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్, మహిళల 49 కేజీలు), జెరెమీ లాల్రి నుంగా(వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 67 కేజీలు), అచింత షెయులీ (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 73 కేజీలు), లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కీ, పింకీ,నయన్మోని సైకియా (లాన్ బౌల్స్, మహిళల ఫోర్స్), హర్మీత్ దేశాయ్, సనీల్ శెట్టి, శరత్ ఆచంట, సత్యన్ జ్ఞానశేఖరన్ (పురుషుల టీమ్ టేబుల్ టెన్నిస్)

ఎవరెవరికి సిల్వర్ మెడల్స్..
సంకేత్ సర్గర్ (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 55 కేజీలు), బింద్యారాణి సోరోఖైబామ్ (వెయిట్ లిఫ్టింగ్, మహిళల 55 కేజీలు), శుశీల లిక్మాబామ్ (జూడో, మహిళల 48 కేజీలు),  వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 96 కేజీలు),  శ్రీకాంత్ కిదాంబి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, బి. సుమీత్ రెడ్డి, లక్ష్య సేన్, చిరాగ్ శెట్టి, గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ, ఆకర్షి కశ్యప్, అశ్విని పొన్నప్ప, పివి సింధు (బ్యాడ్మింటన్, మిక్స్‌డ్ టీమ్), తులికా మాన్ (జూడో, మహిళల +78 కేజీలు). 

కాంస్యం సాధించిన క్రీడాకారులు..
గురురాజా పూజారి (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 61 కేజీలు), విజయ్ కుమార్ యాదవ్ (జూడో, పురుషుల 60 కేజీలు), హర్జిందర్ కౌర్ (వెయిట్ లిఫ్టింగ్, మహిళల 71 కేజీలు), లవ్‌ప్రీత్ సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్, పురుషుల 109 కేజీలు),  సౌరవ్ ఘోసల్ (స్క్వాష్, పురుషుల సింగిల్స్),  గుర్దీప్ సింగ్ (వెయిట్ లిఫ్టింగ్, పురుషుల 109+ కేజీలు), తేజస్విన్ శంకర్ (పురుషుల హైజంప్).

కామన్వెల్త్ 2022లో షూటింగ్ లేకపోవడం భారత పతకాల సాధనను తీవ్రంగా దెబ్బతీసింది. గోల్డ్ కోస్ట్లో జరిగిన కామన్వెల్త్లో  భారత్ 66 పతకాలు సాధించింది. ఇందులో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు ఉన్నాయి.  ఈ గేమ్స్లో పతకాల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక భారత్ సాధించిన 66 పతకాల్లో షూటర్లే ఏడు స్వర్ణాలతో సహా 16  గెలుచుకోవడం విశేషం.