కొత్త ఇండ్లు ఇక్కడే కొంటున్నరు

కొత్త ఇండ్లు ఇక్కడే కొంటున్నరు

హైదరాబాద్​, వెలుగు: సిటీ చుట్టుపక్కల జిల్లాలయిన మేడ్చల్–​ మల్కాజ్​గిరి, సంగారెడ్డిలలోనే ఇండ్లు కొనుక్కోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఈ జిల్లాలలోనే కొత్త రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు నైట్​ఫ్రాంక్​ రిపోర్టు ఇండియా తాజా రిపోర్టు వెల్లడించింది. ఇండ్ల అమ్మకాలు ఈ రెండు చోట్లే జోరుగా సాగుతున్నట్లు పేర్కొంది. 

రిజిస్ట్రేషన్లలో టాప్​ మేడ్చల్​–మల్కాజ్​గిరి

మేడ్చల్​–మల్కాజ్​గిరి జిల్లాలో ఇండ్ల రిజిస్ట్రేషన్లు అక్టోబర్​ నెలలో అత్యధికంగా 46 శాతం దాకా ఉండగా, 36 శాతంతో రంగారెడ్డి జిల్లా  రెండో ప్లేస్​లో నిలిచినట్లు నైట్​ఫ్రాంక్​ ఇండియా రిపోర్ట్​ తెలిపింది. రిజిస్ట్రేషన్​లలో హైదరాబాద్ జిల్లా వాటా 14 శాతం.  అక్టోబర్​ 2022 నెలవారీ డేటాను ఈ సంస్థ గురువారం విడుదల చేసింది.   హైదరాబాద్​ సిటీలో ఇండ్ల రేట్లు ఏడాది కిందటితో పోలిస్తే 12 శాతం పెరిగాయని, సంగారెడ్డిలోనైతే ఏకంగా 37 శాతం పెరిగాయని రిపోర్ట్​ పేర్కొంది.  ఎక్కువ విలువైన ఇండ్లు సంగారెడ్డి జిల్లాలలోనే  అమ్ముడవుతున్నాయని దీని వల్ల తెలుస్తుందని వివరించింది.ఇటీవలి కాలంలో హైదరాబాద్​లో ఇండ్ల రేట్లు బాగా పెరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎక్కువ విలువైన ప్రాపర్టీలు కూడా చురుగ్గానే అమ్ముడవుతున్నాయి. అక్టోబర్​ 2022లో హైదరాబాద్​లో రూ. 2,237 కోట్ల విలువైన 4,597 రెసిడెన్షియల్​ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్​ఫ్రాంక్​ డేటా తెలిపింది. 

ఏడాది కిందటితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు తగ్గినయ్​..

ఈ ఏడాది మొదటి నుంచీ చూస్తే మొత్తం రూ. 27,509 కోట్ల విలువైన 56,003 రెసిడెన్షియల్​ ప్రాపర్టీలు రిజిస్టరయ్యాయి. అయితే అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం రిజిస్టరయిన రెసిడెన్షియల్​ ప్రాపర్టీల సంఖ్యతోపాటు, వాటి విలువ కూడా తగ్గింది. అంతకు ముందు ఇదే కాలంలో హైదరాబాద్​లో రూ. 30,108 కోట్ల విలువైన 67,685 రెసిడెన్షియల్​ ప్రాపర్టీలు రిజిస్టరయినట్లు నైట్​ఫ్రాంక్​ వెల్లడించింది. సిటీ రెసిడెన్షియల్​ మార్కెట్లో హైదరాబాద్​, మేడ్చల్​–మల్కాజ్​గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.25 లక్షలు– రూ.50 లక్షల విలువైన రెసిడెన్షియల్​ యూనిట్ల వాటా 51 శాతంగా ఉంది. ఈ సెగ్మెంట్​ సుమారు 40 శాతం పెరిగినట్లు నైట్​ఫ్రాంక్​ రిపోర్ట్​ తెలిపింది. మరోవైపు రూ. 25 లక్షల లోపు ఇండ్ల అమ్మకాల రిజిస్ట్రేషన్లు మాత్రం 22 శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది. ఖరీదైన  పెద్ద ఇండ్లకు డిమాండ్​ అంతకు ముందులాగే కొనసాగుతున్నట్లు వివరించింది. రూ. 50 లక్షలకు మించిన రెసిడెన్షియల్​ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు అక్టోబర్​ 2021తో పోలిస్తే ఈ అక్టోబర్​లో 27 శాతానికి చేరాయని పేర్కొంది. 500 నుంచి 1,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్​ యూనిట్ల వాటా 21 శాతానికి పెరగ్గా, 1,000 చదరపు అడుగులకు మించిన రెసిడెన్షియల్​ యూనిట్ల వాటా 76 శాతానికి తగ్గినట్లు నైట్​ఫ్రాంక్ తాజా రిపోర్ట్​ తెలిపింది. ఇండ్ల రుణాలపై వడ్డీ రేట్ల పెంపుదల, గ్లోబల్​గా జియో–పొలిటికల్​ టెన్షన్​వంటి అంశాల ప్రభావం లేదని పేర్కొంది.