నాకు కరోనా ఉందా?.ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న…

నాకు కరోనా ఉందా?.ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న…

లాక్​డౌన్ కారణంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్​లో ఔట్ పేషెంట్(ఓపీ) సేవలు నిలిచిపోయాయి. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మినహాయిస్తే కరోనా భయంతో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఇన్​పేషెంట్(ఐపీ) సేవలను బంద్ చేశాయి. దీంతో రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సర్కారు ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఐఎంఏ ఆధ్వర్యంలో టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభిస్తున్నారు. అన్ని రకాల స్పెషలిస్టు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు. వీరంతా ప్రత్యేక టైమ్​లో రోగుల కాల్స్ రిసీవ్ చేసుకుని లక్షణాల ఆధారంగా మెడిసిన్ రెఫర్ చేస్తున్నారు. కరోనా లక్షణాలపైనే ఎక్కువ ఫోన్​కాల్స్ వస్తుండగా, ఫోబియా వల్లేనని డాక్టర్స్ చెబుతున్నారు.

జలుబు, దగ్గు కేసులే ఎక్కువ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత నెల 29న టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 367 కాల్స్ వచ్చాయని ఆఫీసర్లు, డాక్టర్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20  కాల్స్ వస్తున్నాయని, అందులో సుమారు 8 నుంచి 10 మంది తాము జలుబు, దగ్గుతో బాధపడుతున్నామని, కొందరైతే జ్వరం కూడా ఉంటోందని, ఇవి కరోనా లక్షణాలే కదా? ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలని అడుగుతున్నట్లు చెబుతున్నారు. ఒక్క ఆదిలాబాద్ లోనే కాదు, అన్ని జిల్లాల్లోనూ  ఈ తరహా కాల్సే ఎక్కువ ఉంటున్నాయని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పలు రకాల ప్రశ్నలు అడుగుతున్న డాక్టర్లు.. నిజంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు భావిస్తే పరీక్షలకు రెఫర్ చేస్తున్నారు.  లేనివారికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. సాధారణ జలుబు, దగ్గు అని భావిస్తే ఆమేరకు మెడిసిన్ రాసి ఇస్తున్నారు. మహిళలైతే గైనిక్ సమస్యలపై ఎక్కువగా ఫోన్ చేస్తున్నారని డాక్టర్లు అంటున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే జిల్లా కేంద్రాల్లోని గైనిక్ విభాగానికి  రెఫర్ చేస్తున్నారు. మిగిలిన రోగుల విషయంలో సమస్యను బట్టి, గత రిపోర్టులను బట్టి మెడిసిన్ ప్రిస్క్రిప్షన్లు వాట్సాప్ చేస్తున్నారు.

పర్సనల్ నంబర్ల ద్వారా సేవలు

ఖమ్మం జిల్లాలో వారం క్రితం ఐఎంఏతో కలిసి కలెక్టర్ కర్ణన్ టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభించారు. ఐఎంఏ ఆధ్వర్యంలో ఏకంగా 51 మంది డాక్టర్లు తమ పర్సనల్ ఫోన్ నెంబర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అన్నిరకాల స్పెషలిస్ట్ డాక్టర్లు  అందుబాటులో ఉన్నారు. ప్రతిరోజూ ఒక్కో డాక్టర్​కు 5 నుంచి 8 కాల్స్ వస్తున్నాయి. ప్రతి డాక్టర్ తనకు అనుకూలంగా ఉన్న టైంలో కనీసం 2 గంటల చొప్పున వైద్య సేవలు అందిస్తున్నారు.  తమకు మొదట్లో మందుబాబుల నుంచి ఎక్కువ ఫోన్​కాల్స్ వచ్చాయని సైకియాట్రిస్టులు చెప్పారు. మద్యం దొరకక తమ నాన్నో, అన్నో , తమ్ముడో పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, ఏం చేయాలని కుటుంబసభ్యులు అడిగేవారన్నారు. ‘ఒక్కసారిగా మందు మానేయడం వల్ల మందుబాబులకు  మ్యాగ్జిమమ్ రెండు వారాల వరకు ఇబ్బందులు ఉంటాయి. లాక్ డౌన్ ప్రారంభమైన కొత్తలో రోజుకు కనీసం 10 కాల్స్ వరకు ఇలాంటి ఫిర్యాదులు వచ్చేవి. ఆ తర్వాత మెల్లగా ఇలాంటి కాల్స్ తగ్గాయి’ అని  చెప్పారు. నల్గొండ జిల్లాలో టైం ప్రకారం టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తిరిగి ఈవెనింగ్ 4 నుంచి 6 గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు టెలి మెడిసిన్ సేవలు ప్రారంభించలేదు. కానీ  కలెక్టరేట్ లో ఆరోగ్య సమస్యల పై ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ చేసిన వారి ప్రశ్నలకు డాక్టర్లతో  సమాధానాలు ఇప్పిస్తున్నారు. ఈ కంట్రోల్​రూమ్​కు సైతం చాలామంది పొడి దగ్గు, తుమ్ములు వంటి సమస్యల పై ఫోన్ చేసి, అనుమానాలను తీర్చుకుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.  కరీంనగర్ జిల్లా డీఎంహెచ్ వో ఆఫీసులో టెలీమెడిసిన్ సేవలను గురువారం నుంచి ప్రారంభించారు.   నాలుగు రోజుల్లో 100 కాల్స్ రాగా ఇందులో 80 కాల్స్ సాధారణ జబ్బుల గురించి, 20 కాల్స్ ఆల్కహాల్ అడిక్టెడ్​ వారివే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఇక్కడ మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు.  వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో 27 మంది డాక్టర్స్ కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు.   జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్యలపైనే ఎక్కువ కాల్స్ వస్తున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనూ ప్రతి రోజూ 12 వరకు కాల్స్ వస్తుండగా, అత్యధికంగా కరోనా లక్షణాలకు సంబంధించే ఉంటున్నాయి