
బయట చల్లటి వాతావరణానికి ఏవైనా వేడిగా శ్నాక్స్ తినాలనిపించడం నేచురల్. అందులోనూ చాలామంది శ్నాక్స్లో కూడా నాన్వెజ్ వెరైటీస్ ఇష్టపడతారు. అయితే ఎప్పుడూ తినే ఐటమ్స్ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయాలంటే మాత్రం సీ ఫుడ్ ది బెస్ట్. పైగా ఈ సీజన్లో చేపలు విరివిగా దొరుకుతుంటాయి. కాబట్టి చేపలతో చేసుకునే ఈ మూడు రెసిపీలు అస్సలు మిస్కాకండి. ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే.. తినే కొద్దీ తినాలనిపిస్తాయి.
పకోడి
కావాల్సినవి :
- చేప ముక్కలు: పావు కిలో
- పసుపు, మిరియాల పొడి: పావు టీస్పూన్ చొప్పున,
- ఉప్పు, నీళ్లు: సరిపడా, అల్లం, వెల్లుల్లి తురుము: ఒక టేబుల్ స్పూన్
- కారం, నిమ్మరసం, వాము: అర టీస్పూన్ చొప్పున,
- గరం మసాలా: ఒక టీస్పూన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా: కొంచెం
- శనగపిండి: ముప్పావు కప్పు
- బియ్యప్పిండి: రెండున్నరటేబుల్ స్పూన్లు
- నూనె: ఒకటిన్నర
- టేబుల్ స్పూన్
తయారీ : శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని గిన్నెలో వేసి అందులో పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలు పక్కన ఉంచిన తర్వాత ఆ మిశ్రమంలో దంచిన వాము, నూనె, కారం, గరం మసాలా, కరివేపాకు, పుదీనా, బియ్యప్పిండి, శనగపిండి వేసి మరోసారి బాగా కలపాలి. కొన్ని నీళ్లు చల్లి, మసాలాలను చేప ముక్కలకు పట్టించాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ వేగించాలి.
తందూరి ఫిష్ కబాబ్స్
కావాల్సినవి :
చేప ముక్కలు: అర కిలో
ఉప్పు, నూనె: సరిపడా
పెరుగు: ఒక కప్పు
ఆవనూనె: పావు కప్పు
పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, శనగపిండి, నెయ్యి: ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
అల్లం, వెల్లుల్లి పేస్ట్: ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
పసుపు: పావు టీస్పూన్
కసూరీమేథి పొడి: అర టీస్పూన్
గరం మసాలా: ఒక టీస్పూన్
తయారీ : చేప ముక్కలపై ఉప్పు, నిమ్మరసం చల్లి పక్కన ఉంచాలి. పాన్లో ఆవ నూనె వేసి వేడి చేయాలి. అందులో శనగ పిండి వేసి కలపాలి. ఒక గిన్నెలో పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కసూరీ మేథి పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో శనగపిండి మిశ్రమం పోసి కలపాలి. అందులోనే చేప ముక్కలు కూడా వేసి ఆ మిశ్రమాన్ని వాటికి పట్టించాలి. వాటిని ఒవెన్లో పెట్టి ఉడికించాలి. కాసేపటి తర్వాత తీసి నెయ్యి వేసి మళ్లీ ఒవెన్లో బేక్ చేయాలి. ఒవెన్ లేకపోతే పాన్లో ఉప్పు వేడి చేసి, దానిపై ఒక స్టాండ్ పెట్టి ఆపై చేప ముక్కలు ఉంచి మూతపెట్టాలి. అలా కాసేపయ్యాక నెయ్యి వేసి మరికాసేపు ఉడికిస్తే సరి.
పాప్ కార్న్
కావాల్సినవి :
చేప ముక్కలు: పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్
స్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు, మిరియాల పొడి: సరిపడా,
మైదా, బ్రెడ్ పొడి: ఒక్కో కప్పు, కోడిగుడ్డు: ఒకటి
తయారీ :
చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి.తర్వాత వాటిని ఒక గిన్నెలో వేయాలి. వాటితోపాటు కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో మైదా పిండి వేసి, నీళ్లు పోసి కలపాలి.ఆ మిశ్రమంలో చేప ముక్కల్ని ముంచి తీసి కోడిగుడ్డు సొనలో ముంచాలి. తర్వాత వాటిని బ్రెడ్ పొడిలో దొర్లించాలి. చివరిగా ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులోచేప ముక్కలు వేసి వేగించాలి.