రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డి గూడా గ్రామానికి చెందిన శోభ అనే వివాహితను దేవునిపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం పొలాల్లో పసి పాప ఏడుపు వినిపించగా గమనించిన ఒక రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రాత్రి నుంచి మూడేళ్ల కూతురు తల్లి మృతదేహం వద్దనే రోదిస్తూ ఉందని తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సీతారాం దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. నిందితులను గుర్తించేందుకు పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు కట్టలేరు బ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. ఉరి తాడుకి తల వేలాడుతుండగా, మిగిలిన దేహం కింద పడి కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి ఎవరైనా ఇలా ఉరి వేసి వేలాడదీశారా లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య కాకపోయి ఉండొచ్చని.. ఆత్మహత్య చేసుకుని ఉంటే అంత దారుణంగా తల, మొండెం వేరుగా పడే అవకాశాలు తక్కువని పోలీసులు అనుమానిస్తున్నారు.
