Good Health: లాఫింగ్ యోగా... ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా పరార్.. ఎలా చేయాలంటే..!

Good Health: లాఫింగ్ యోగా... ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా పరార్.. ఎలా చేయాలంటే..!

నవ్వు నాలుగు విధాల చేటు.... అనేది పాత సామెత....నవ్వు నలభై విధాలా గ్రేటు... అనేది ఇప్పటి మాట.జీవితంలో ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ ఉండాలి. అది మనసుకే కాదు... ఆరోగ్యానికీ మేలు. ఎప్పుడూ హాయిగా నవ్వుతుండే వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రోలర్ కోస్టర్ జీవితంలో మనిషి మనసారా నవ్వుకోవడమే మానేశాడు.అలాంటి వాళ్లు తప్పక చేయాల్సిన యోగానే... హాస్య యోగా గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.   ..  !

'సంతోషం సగం బలం.. హాయిగ నవ్వమ్మా....!..అని సినిమా పాటను వినే ఉంటారు. కానీ మాటలు, పాటల్లో ఉన్న సంతోషం మనుషుల జీవితాల్లో ఉండట్లేదు ఈరోజుల్లో, ముఖ్యంగా పట్నాల్లో ఉంటున్న వాళ్లలో చాలామంది ఒత్తిడితోనే జీవిస్తున్నారు. ఇటు ఉద్యోగం... అటు కుటుంబం మధ్య నలిగిపోతున్నారు. ఆఫీసుకెళ్లి హాయిగా సాయంత్రం తొందరగా ఇంటికి చేరే పరిస్థితి లేదు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యతో మానసికంగా ఒత్తిడి లోనవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు నవ్వడమే మర్చిపోయారు. దాంతో లేనిపోని రోగాలను తెచ్చుకుంటున్నారు. అందుకే చాలామంది హాస్య యోగాను ప్రారంభించమంటున్నారు నిపుణులు.

ఎలాంటి జోకులు, కామెడీ, సంతోషకరమైన వాతావరణం వంటివి లేకుండా కేవలం శారీరక కదలికల ద్వారా నవ్వడమే హాస్య యోగా. ..ఇది చేస్తే ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. మెదడుకు ప్రాణవాయువు సరఫరా మెరుగవుతుంది. శరీరం లోపలి అవయవాలు కూడా చురుగ్గా పని చేస్తాయి. కాబట్టి రోజులో సాధ్యమైనంత ఎక్కువగా పగలబడి నవ్వండి. ఆరోగ్యంగా ఉండండి.

లాఫింగ్ యోగా- క్లబ్బులు

 ఈ యోగా మానసిక ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. సహజంగా లేదా కృత్రిమంగా... ఏ విధంగా నవ్వినా మన మెదడు ఆ తేడాను పసిగట్టదు. ఎలా నవ్వినా మెదడు ఎండార్ఫిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ ఎండార్ఫిన్లు ఆనందాన్నీ, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. తాను చేసిన పరిశోధన ఫలితాల ఆధారంగా 1995లో ముంబైకి చెందిన 'డాక్టర్ మదన్ కటారియా' ఈ హాస్య యోగా ప్రక్రియను రూపొందించాడు.

 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో లాఫింగ్ క్లబ్బులు ఉన్నాయి. హైదరాబాద్​ లో కూడా ఈ లాఫింగ్ క్లబ్బులు చాలానే ఉన్నాయి.లాఫింగ్ క్లబ్ లు, యోగా శిక్షకులు హాస్య యోగాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. మొదట నవ్వుకోవడానికే పరిమితమైన ఈ లాఫింగ్ క్లబ్బులు ప్రస్తుతం ఎంతో మార్పు చెందాయి.

 ఇక్కడ జోక్స్ వేసి నవ్వించడం ఉండదు. యోగా బ్రీతింగ్ (శ్వాస సంబంధిత ఆసనం)తో పాటు లాఫింగ్ ఎక్సర్సైజ్ చేయడం దీని ప్రత్యేకత. మనదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ హాస్య యోగా బాగా ప్రాచుర్యం పొందింది. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు హాస్య యోగా చేస్తే అనారోగ్యం దూరమవడమే కాకుండా మానసిక ఉల్లాసం సొంతమవుతుంది.

ఎవ్వరికీ ఇబ్బందొద్దు...

నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న కారణంతో కొందరు రీసౌండ్ వచ్చేంత పెద్దగా నవ్వుతారు.
అలాచేస్తే చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అప్పుడు వాళ్లతో గొడవలు కావొచ్చు. అందుకే నవ్వుతున్నప్పుడు అవతలి వ్యక్తుల పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా ఎందుకొచ్చిన గోల అనుకుంటే నేరుగా ఏదైనా పార్కు లేదా లాఫింగ్ క్లబ్​ కు  వెళ్లి ఇష్టం వచ్చినట్టు నవ్వుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎదుటి వాళ్లకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అలాగే మానసిక ఒత్తిడీ దూరం అవుతుంది. లాఫింగ్ క్లబ్బులు పెరుగుతున్నా... వాటికి వెళ్లేవాళ్లు చాలా తక్కువగానే ఉన్నారు. బిడియం, సిగ్గు, పక్కనోళ్లు ఏమనుకుంటారోననే కారణాలతో చాలా వరకు వీటికి దూరంగా ఉంటున్నారు.

అయిన వాళ్లతో...

రోజూ వాకింగ్, జాగింగ్​ కు  వెళ్లే వాళ్లు... ఆ సమయంలోనే 10-15 నిమిషాలు నవ్వడానికి కేటాయిస్తే చాలు. ఉద్యోగాలు చేస్తూ... మానసికంగా. శారీరకంగా బాగా ఒత్తిడికిలోనవుతున్నారు ఎక్కువమంది. కాబట్టి రోజూ ఒక పావు గంట ఈ హాస్య యోగా చేయండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, దంపతులు అందరూ కలిసి ఒక గ్రూప్ గా చేరి ఈ యోగాను ఆచరించొచ్చు. ఈ యోగాకు ఎలాంటి వయసు పరిమితి లేదు. చిన్నపిల్లల దగ్గరి నుంచి ముసలివాళ్ల అందరూ చేయవచ్చు .  మరి మనం కూడా హాస్యయోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకుందామా..!