ఉత్తరప్రదేశ్​లో మరో ఎన్​కౌంటర్.. 

ఉత్తరప్రదేశ్​లో మరో ఎన్​కౌంటర్.. 
  • మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని కౌశాంబి జిల్లాలో జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ హతమయ్యాడు. గుఫ్రాన్ హత్యలు, దోపిడీలు సహా 13 కేసులలో పోలీసులకు మోస్ట్ వాంటెడ్​గా ఉన్నాడు. యూపీ పోలీసులు అతడిపై ఇదివరకే రూ.1.25 లక్షల రివార్డును ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున సమ్దా గ్రామానికి దగ్గరలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారని జిల్లా ఎస్పీ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే గుఫ్రాన్​ను గుర్తించారని చెప్పారు. పోలీసులను చూడగానే గుఫ్రాన్ కాల్పులకు దిగడంతో వాళ్లు ఎదురు కాల్పులు జరిపారని వెల్లడించారు. ఫైరింగ్​లో గుఫ్రాన్​కు బులెట్ గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించామన్నారు. అక్కడ ట్రీట్​మెంట్ పొందుతూ నిందితుడు చనిపోయాడని ఎస్పీ తెలిపారు.

స్పాట్​ నుంచి ఒక కార్బైన్, పిస్టల్, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, యూపీ పోలీసులకు, నేరగాళ్లకు మధ్య జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్లలో ఇది తాజాది. 2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్​లో 10,900కు పైగా ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లు జరిగాయి. అందులో 183 మంది నేరస్థులు మరణించగా.. 5,046 మంది గాయపడ్డారు. 23,300 మంది క్రిమినల్స్​ అరెస్ట్ అయ్యారు.