గంజాయితో పట్టుబడిన తల్లీకొడుకు.. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

గంజాయితో పట్టుబడిన తల్లీకొడుకు.. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

కాగజ్ నగర్, వెలుగు: గంజాయి అమ్ముతున్న తల్లీకొడుకు పట్టుబడ్డారు. కౌటాల సీఐ సంతోష్ కుమార్ తెలిపిన ప్రకారం.. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా టెకంగూడ గ్రామానికి చెందిన దుర్గం శాంతాబాయి తన కొడుకు లింగయ్యతో కలిసి వ్యవసాయం చేస్తుండగా, కొన్నేండ్లుగా నష్టపోతున్నారు. ఈజీగా మనీ సంపాదించేందుకు గంజాయి అమ్మేందుకు ప్లాన్ వేశారు. కొన్ని రోజుల కింద  కిలో ఎండు గంజాయి కొని ఇంటికి తెచ్చారు.

అందులోంచి అరకిలో గంజాయిని అమ్మగా.. మిగిలినది ఇంట్లో దాచారు. దాన్ని కూడా రణవెల్లి శివారులోని తమ పొలం వద్ద దాచిపెట్టేందుకు బుధవారం వెళ్తున్నారు. సమాచారం అందడంతో  సీఐ సంతోష్​ ​కుమార్, చింతల మానేపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేశ్  సిబ్బందితో వెళ్లి నిఘా పెట్టి పట్టుకున్నారు. శాంతాబాయి వద్ద  404 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ. 8 వేలు ఉంటుందని సీఐ తెలిపారు.