హింసిస్తున్న కొడుకును చంపించిన తల్లి

హింసిస్తున్న కొడుకును చంపించిన తల్లి
  • మందు తాగి జల్సాలు తిడుతూ..కొడుతుండడడంతో హత్యకు ప్లాన్​
  • తాగించి మెడకు టవల్​బిగించి మర్డర్​
  • ప్రధాన నిందితురాలితో పాటు సహకరించిన వారి అరెస్ట్​

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో జల్పాలకు అలవాటు పడి మద్యానికి బానిసై ఇబ్బందులు పెడుతున్న కొడుకును హత్య చేయించిందో తల్లి. ఈ ఘటనలో తల్లితో పాటు మరో ముగ్గురిని సదాశివనగర్​ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డి పెద్ద చెరువు సమీపంలో గత నెల 25న గుర్తు తెలియని వ్యక్తి శవం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.  ట్రైనీ ఐపీఎస్, సదాశివనగర్​ఎస్​హెచ్​వో ఎం.ఎస్​.కాజల్​ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయగా హత్య వివరాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడిని లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన కదాల సాయిలు (48)గా గుర్తించారు. మృతుని తల్లి లచ్చవ్వ ఈ హత్య చేసినట్టుగా తేల్చారు. ఆమె విచారణలో పలు విషయాలు బయటపెట్టింది. సాయిలు ఆరేడు పెండ్లిళ్లు చేసుకుని అందరినీ వదిలేశాడు. 

మద్యానికి అలవాటు పడి జల్సాలు చేసేవాడు. భూమి అమ్మగా వచ్చిన డబ్బులతో మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టేవాడు. ఈ బాధల్ని భరించలేని లచ్చవ్వ నిజామాబాద్ ​జిల్లా కమ్మర్​పల్లిలోని నాగాపూర్​కు చెందిన బసవకొండ దేవ్​కు ఫోన్​చేసి తన కొడుకును చంపాలని కోరింది. వరుసకు మనవడయ్యే దేవ్​దీనికి ఒప్పుకుని ఈ నెల 24న కరీంనగర్​ జిల్లాలోని బండ లింగాపూర్​కు చెందిన మారుతి అలియాస్​ చందుతో కలిసి గ్రామానికి వచ్చాడు. సాయిలును అడ్లూర్​ఎల్లారెడ్డి శివారులోని చెరువు వద్దకు తీసుకువెళ్లారు. ఎక్కువగా మద్యం తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత మెడకు టవల్​బిగించి చంపి పారిపోయారు. కేసు ఎంక్వైరీలో సదాశివనగర్​ సీఐ సంతోష్​కుమార్​, ఎస్సై  రాజు, సిబ్బంది చురుకుగా వ్యవహరించారని ఎఎస్పీ కాజల్ తెలిపారు.