నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం మదర్ డెయిరీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బుధవారం నామినేషన్ల స్వీకరణ ముగిసింది. నల్గొండ జిల్లాలోని నాలుగు డైరెక్టర్ పోస్ట్‌లకు 15 మంది, రంగారెడ్డి జిల్లాలోని 2 జనరల్ స్థానాలకు ఆరుగురు నామినేషన్లు వేశారు. అయితే ఈ సారి డెయిరీ ఎన్నికలు ఆలేరు చుట్టే తిరుగుతున్నాయి. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, నల్గొండ డీసీసీబీ మాజీ చైర్మన్గొంగడి మహేందర్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది.
నామినేషన్‌వేసిన15 మందిలో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్ఎస్నుంచి ఐదుగురు ఉన్నారు. వీరిలో మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఆలేరు నియోజకవర్గానికి చెందిన వీళ్లలో చైర్మన్ క్యాండిడేట్‌గా గుడిపాటి మధుసూదన్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో మధుసూదన్‌రెడ్డికి ఇచ్చిన హామీ మేరకు చైర్మన్‌గా అవకాశం కల్పించాలన్న నిర్ణయానికి వచ్చారు.
కానీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 297 ఓట్లు ఉండగా ఇందులో ఆలేరు నియోజకవర్గంలోనే 130 ఉన్నాయి. దీంతో ఆలేరు సెగ్మెంట్‌కు చెందిన ఎమ్మెల్యే అనుచరుడు మధుసూదన్‌రెడ్డిని చైర్మన్‌గా తెరపైకి తెచ్చారు. కానీ గొంగడి మహేందర్‌రెడ్డి వర్గం కూడా గట్టిగానే ఫైట్ చేస్తోంది. మెజార్టీ సొసైటీ చైర్మన్లు తమ వైపే ఉన్నారని ఇరుపార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏకగ్రీవం అయ్యేందుకు చర్చలు
శ్రీకర్‌రెడ్డి చైర్మన్ ఎన్నికప్పుడు కూడా ఇదే తరహా పోటీ జరిగింది. డెయిరీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అప్పుడు అయిలయ్య గట్టిగానే ప్రయత్నించారు. కానీ బీఆర్‌ఎస్ అధికారంలో ఉండడం, మెజార్టీ సొసైటీలు మహేందర్‌రెడ్డి చేతిలో ఉండడంతో అయిలయ్య ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పవర్‌లోకి రావడంతో డెయిరీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎమ్మెల్యే అయిలయ్య పావులు కదుపుతున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సపోర్ట్‌తో డెయిరీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లాలో రెండు డైరెక్టర్ స్థానాలకు కూడా పోటీ నెలకొంది. నామినేషన్లు వేసిన ఆరుగురిలో ముగ్గురు రెబల్స్ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే రాంరెడ్డి కోటాలో ఇద్దరు పోటీ పడుతున్నారు. మహేశ్వరం, కందుకూరు, పరిగికి చెందిన చైర్మన్లకు డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
పోటీ నుంచి తప్పుకున్న జితేందర్‌రెడ్డి
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తమ్ముడు జితేందర్‌రెడ్డి చైర్మన్ పోటీ నుంచి తప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున చైర్మన్‌గా ఎన్నికైన జితేందర్‌రెడ్డి తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ మారిన తర్వాత మరోసారి పదవి వస్తుందని ఆశించినప్పటికీ, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తన అనుచరుడు గంగుల కృష్ణారెడ్డిని చైర్మన్ చేశారు.
కృష్ణారెడ్డి టర్మ్ ముగిశాక జరిగిన ఎన్నికల్లో జితేందర్‌రెడ్డి మరోసారి ప్రయత్నించారు. అప్పుడు గొంగిడి మహేందర్‌రెడ్డి వర్గం నుంచి శ్రీకర్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన జితేందర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. తర్వాత అమిత్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు అమిత్‌కు తెలంగాణ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో, మళ్లీ అదే ఫ్యామిలీకి చెందిన జితేందర్‌రెడ్డిని మదర్ డెయిరీ చైర్మన్ చేస్తే విమర్శలు వస్తాయని ఆయనను తప్పించారు.
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బుధవారం జితేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. డెయిరీ ఎన్నికల్లో సహరించాలని కోరడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో సహరిస్తే త్వరలో మంచి హోదా కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు తెలిసింది.