తల్లి, కూతుళ్లు కలిసి బోర్డ్ ఎగ్జామ్స్ క్లియర్ 

తల్లి, కూతుళ్లు కలిసి బోర్డ్ ఎగ్జామ్స్ క్లియర్ 

సంకల్పం బలంగా ఉండాలి కానీ మనిషి సాధించిలేనిదంటూ ఏదీ ఉండదు. అందుకు ఉదాహరణ త్రిపురకు చెందిన షీలా రాణి దాస్. చదువుకోవాలన్న కోరిక బలంగా ఉన్నా పరిస్థితులు సహకరించలేదు. చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో అప్పుడు పదో తరగతి పరీక్షలకు హాజరు కాలేకపోయింది. ఆ తరువాత పిల్లలు పుట్టడంతో చదువును కొనసాగించలేకపోయింది. కొన్నాళ్లకు భర్త దూరం కావడంతో కుటుంబ భారం ఆమెను చదువుకు మరింత దూరం చేసింది. కానీ  షీలా రాణి దాస్ కోరికను  ఆమె ఇద్దరు కూతుళ్లు అర్ధం చేసుకున్నారు, తల్లి కన్న కలను నిజం చేయాలని నిర్ణయించుకుని ప్రోత్సహించారు. ఫైనల్ గా ఆమె అనుకున్నది సాధించడంతో  ఆ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.

త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కాగా అందులో 53 ఏళ్ల షీలా రాణి ఉత్తీర్ణత సాధించారు. అదే రోజున రిలీజైన 12 వ తరగతి పరీక్షల ఫలితాల్లో అమె ఇద్దరు కూతుళ్లు  రాజశ్రీ దాస్, జయశ్రీ దాస్  కూడా ఉత్తీర్ణత సాధించడం విశేషం. దీనిపై షీలా రాణి దాస్ మాట్లాడుతూ.. " నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషంగా ఉంది. నా ఇద్దరు కుమార్తెలు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణీత సాధిస్తానన్న నమ్మకం నాకు ముందు నుంచి ఉంది" అని  షీలా రాణి దాస్ తెలిపారు. ప్రస్తుతం ఆమె అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తోంది.