
హుజూరాబాద్ రూరల్ వెలుగు: కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు అగ్రనేతల తల్లి మృతి చెందారు. హుజూరాబాద్మండలం తుమ్మనపల్లికి చెందిన గోపగాని కొమురమ్మ(92 )కు ఐదుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. వీరిలో ఇద్దరు కొడుకులు గోపగాని ఐలన్న, కుమారస్వామి అలియాస్రవన్న పీపుల్స్ వార్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. 1979లో గూడూరులో ఏర్పడిన తొలి దళంలో కుమారస్వామి సభ్యుడిగా చేరారు. దళంలో ఉండగానే గ్రెనేడ్ ప్రమాదంలో ఆయన మరణించారు.
ఇక ఐలన్న పీపుల్స్ వార్ పార్టీకి ఉత్తర తెలంగాణ రీజనల్ కార్యదర్శిగా పని చేస్తూనే 1988లో హైదరాబాద్ లో అదృశ్యమయ్యారు. ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియలేదు. అప్పట్లో పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీ ఆయన మిస్సింగ్ పై నిరసన చర్యలకు దిగింది. ఇందులో భాగంగామంథని ఎంపీపీ కిషన్ నాయక్, కమాన్‌పూర్ ఎంపీపీ రామచంద్ర గౌడ్‌ను కిడ్నాప్ చేసిన అనంతరం విడుదల చేసింది.
ఆ తర్వాత తాడిచెర్ల ఎంపీపీ మలహర్ రావును కిడ్నాప్ చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో కాల్చి చంపింది. ఒక ఎంపీపీని నక్సలైట్లు హత్య చేయడం అదే తొలిసారి కావడంతో ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం ఐలన్న కిడ్నాప్‌పై ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, రిపోర్టును తొక్కిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా ఐలన్న కిడ్నాప్‌కు ఆనాటి డీఐజీ వ్యాస్ నే కారణమని పీపుల్స్ వార్ పార్టీ భావించి ఆయనను హైదరాబాద్‌లో కాల్చి చంపినట్లు అప్పట్లో ప్రకటించింది. తన కొడుకు ఐలన్న కోసం దాదాపు నాలుగు దశాబ్దాలుగా తల్లి ఎదురు చూస్తూ.. చివరకు కన్నుమూసింది. ప్రస్తుతం ఐలన్న మరో సోదరుడు లింగన్న సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. కొమురమ్మ మృతి పట్ల పలువురు ప్రముఖులు, ప్రజలు
నివాళులర్పించారు.