
హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు: అప్పు తీసుకుని ఇవ్వకపోవడంతో పాటు ఆపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మనస్తాపంతో మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బాధితులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన గుడికందుల రమేశ్ 2012లో హసన్ పర్తి మండలం దేవన్నపేటకు చెందిన పోలపెల్లి చంద్రశేఖర్ వద్ద రూ.12 లక్షలు అప్పుగా తీసుకుని.. తిరిగి ఇవ్వడంలేదు. చంద్రశేఖర్ కుటుంబం అడుగుతుండగా.. రేపు మాపంటూ రమేశ్ వాయిదాలు వేస్తున్నాడు. ఆపై నాలుగు నెలల కింద చంద్రశేఖర్ కుటుంబంపై ముల్కనూరు పీఎస్‌లో రమేశ్ తన సోదరితో కేసు పెట్టించాడు.
అదే సమయంలో బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టగా ఈనెల 5న అప్పు పైసలు ఇస్తానని రమేశ్ కుటుంబం అగ్రిమెంట్ రాసిచ్చింది. ఆ రోజున ఇవ్వకపోగా రమేశ్ తండ్రి సమ్మయ్య ఈనెల 13న బాధితులపై పీఎస్‌లో మరో ఫిర్యాదు చేశాడు. స్టేషన్ చుట్టూ బాధిత కుటుంబం తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు. దీంతో పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని చంద్రశేఖర్ తల్లి యాదమ్మ చిన్న కొడుకు నరేశ్‌తో కలిసి బుధవారం రమేశ్ ఇంటికి వెళ్లింది.
అప్పు పైసలపై నిలదీయగా సమ్మయ్య బెదిరింపులకు పాల్పడడంతో మనస్తాపంతో యాదమ్మ అక్కడే గడ్డి మందు తాగింది. హనుమకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై ముల్కనూరు ఎస్ఐ సాయిబాబును వివరణ కోరగా.. బాధితులెవరూ తనను కలవలేదని చెప్పారు. కాగా.. యాదమ్మ సూసైడ్ అటెంప్ట్ ఘటన చర్చనీయాంశం కావడంతో జిల్లా కోర్టు ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రావణ స్వాతి విచారించి వివరాలు తీసుకున్నారు.