
వెలుగు: కన్న కూతురు అదృశ్యమైంది. దీంతో ఇరుగు పొరుగు వారు ప్రేమ వ్యవహారమే కారణమని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయిందని చర్చించుకోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారకఘటన నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కంగ్టి మండలం భీంరా గ్రామంలో శుక్రవారం జరిగింది. కంగ్టి ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భీంరా గ్రామానికి చెందిన అప్పారావు, సుమాబాయి దంపతుల కుమార్తె కంగ్టి అప్పర్ ప్రైమరీ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. సాయంత్రానికి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనపడిన తల్లిదండ్రులు కంగ్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారంతోనే ఇంటి నుంచి అమ్మాయి వెళ్లిపోయినట్లు చుట్టు పక్కల వారు చర్చించుకోవడం, హైదరాబాద్ లో ఆ బాలిక ఉన్నట్టు నిర్ధారణ కావడంతో తల్లి సుమాబాయి(42) తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం పురుగుల మందు తాగింది. గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను నారాయణఖేడ్ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుమాబాయి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.