
- కూతురు, మనుమడే ఇలా చేశారట
- అటవీ ప్రాంతంలో పడి ఉన్న వృద్ధురాలు
- కాళ్లు చేతులు కట్టేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- అధికారులకు స్థానికుల సమాచారం
జగిత్యాల: ఉన్న పొలం రాయించుకున్నరు.. ఒంటి మీదున్న బంగారం గుంజుకొని బిడ్డ ఇంట్లోంచి తరిమేసింది.. మనుమడు చేయిచేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఊత కర్ర సాయంతో రోడ్డెక్కంది.. కండ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నయ్.. అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డ గుర్తుకు వచ్చింది.. అయినా వెనక్కి వెళ్లలేదు.. గమ్యంలేని ప్రయాణం సాగించింది.. అటవీ ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయింది..! ఆమె అలికిడి శబ్దాలు విన్న స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. వారు వచ్చారు. ఆమె కాళ్లు, చేతులకు తాళ్లతో కట్టేసి ఉన్నాయి.. తాళ్లు విప్పారు.. ఏ ఊరు మీది.. ఏమైంది.. అంటే తన వ్యథా భరిత గాథను వెల్లబోసుకుందీ వృద్ధురాలు.
కర్మకాండలు ఎవరు చేయాలని..
తన పేరు వేల్పుల బూదవ్వ అని తెలిపింది... వివరాలు ఆమె మాటల్లోనే.. ‘మాది జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా. చాలా ఏండ్ల క్రితం భర్త చనిపోవడంతో నా ఒక్కాగానొక్క కూతురైన ఈశ్వరి అత్తగారి ఊరైన నర్సింగాపూర్ లో ఉండేదాన్ని. ఇంట్లో ఈశ్వరి, ఆమె భర్త రాజయ్య, కొడుకు చిరంజీవితోపాటు వేల్పుల బూదవ్వ కాలం వెల్లదీసేదాన్ని. ఇటీవల జగిత్యాలలోఉన్న ఎకరం భూమి, ఇంటిని కూతురు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆ తర్వాత నన్ను వేధించడం మొదలు పెట్టారు. సూటి పోటి మాటలన్నారు. నా బిడ్డె, మనుమడు నన్ను కొట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టారు.’ అంటూ కన్నీరు మున్నీరైంది బూదవ్వ. ఏం చేయాలో పాలుపోని బూదవ్వ సత్తువను కూడగట్టుకొని పది కిలోమీటర్లు నడిచింది బూదవ్వ. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె అటవీ ప్రాంతంలో పడి ఉంది. మనిషి అలికిడి శబ్దాలు విన్న స్థానికులు అధికారులకు సమాచారం అందించగా అసలు విషయం బయటపడింది. తన సంచిలో ఉన్న కూతురు ఈశ్వరి ఫోన్ నంబర్ అధికారులకు ఇచ్చింది బూదవ్వ. ఆఫీసర్లు ఈశ్వరికి కాల్ చేయ తమకేం సంబంధం లేదంటూ కాల్ కట్ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా భూమి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు.