మతిస్థిమితం లేక తప్పిపోయిన తల్లి.. ఏడేండ్ల తర్వాత ఇంటికి

మతిస్థిమితం లేక తప్పిపోయిన తల్లి.. ఏడేండ్ల తర్వాత ఇంటికి
  • మతిస్థిమితం లేక 2015లో తప్పిపోయిన తల్లి
  • చేరదీసిన చెన్నైలోని రిహాబిలిటేషన్​ సెంటర్​
  • హనుమకొండలోని కుటుంబీకులకు అప్పగింత

హనుమకొండ, వెలుగు: మతిస్థిమితం లేని ఓ తల్లి ఏడేండ్ల కిందట తప్పిపోయింది. ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో ట్రైన్ ఎక్కి ప్రయాణం చేసింది. చివరకు చెన్నై చేరగా.. అక్కడ ఓ రిహాబిలిటేషన్​సెంటర్​ నిర్వాహకుల కంటపడింది. పసిపిల్లల మనస్తత్వంతో ఉన్న ఆ తల్లిని చూసి నిర్వాహకులు ఆమెను చేరదీశారు. ట్రీట్​మెంట్​ అందించి ఆమె నుంచి వివరాలు రాబట్టారు. ఏడేండ్ల తర్వాత కుటుంబీకులకు అప్పగించారు. హనుమకొండ సీఐ శ్రీనివాస్ ​తెలిపిన వివరాల ప్రకారం..హనుమకొండ యాదవ నగర్​కు చెందిన నాగరబోయిన లక్ష్మికి భర్త మల్లేశం, కొడుకు ప్రమోద్, కూతురు శిల్ప ఉన్నారు. మల్లేశం హెడ్​మాస్టర్​గా పని చేసి రిటైర్​ అయ్యాడు. లక్ష్మికి మొదటి నుంచి మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. 2015లో లక్ష్మి నడుచుకుంటూ వరంగల్ రైల్వే స్టేషన్​కు వెళ్లింది. అక్కడ కనిపించిన ట్రైన్​ఎక్కడంతో చెన్నై చేరుకుంది.

మానసిక స్థితి సరిగా లేక దిక్కులు చూస్తున్న ఆమెను చెన్నైకి చెందిన అన్బగం రిహాబిలిటేషన్​ సెంటర్​ నిర్వాహకులు చేరదీశారు. ట్రీట్​మెంట్ అందించారు. కొద్దిరోజుల కిందట ఆమె ఆరోగ్యం కుదుట పడగా.. సెంటర్​ నిర్వాహకులు ఆమె నుంచి నెమ్మదిగా వివరాలు రాబట్టారు. అనంతరం హనుమకొండ పోలీసుల నంబర్​ కనుక్కుని సీఐ శ్రీనివాస్​ జీకి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి వారితో వీడియో కాల్​ మాట్లాడించారు. లక్ష్మిని గుర్తుపట్టిన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. లక్ష్మిని హనుమకొండ ఏసీపీ కిరణ్​కుమార్, సీఐ శ్రీనివాస్​జీ, కాలనీవాసుల సమక్షంలో కుటుంబసభ్యులకు అప్పగించారు. చనిపోయిందనుకున్న తల్లి ఏడేండ్ల తరువాత చెంతకు చేరడంతో కూతురు శిల్ప బోరున విలపించింది. 

2020లో డెత్​ సర్టిఫికెట్..​

లక్ష్మి 2015లో తప్పిపోగా.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె చనిపోయిందని భావించి మల్లేశం మరో వివాహం చేసుకున్నాడు. పిల్లలకూ పెళ్లయింది. వారికి పిల్లలు కూడా పుట్టారు. ఏండ్లు దాటుతున్నా లక్ష్మి ఆచూకీ లభించకపోవడంతో 2020లో లక్ష్మి భర్త, కొడుకు ఆమె పేరున డెత్​ సర్టిఫికెట్​ తీసుకున్నారు. లక్ష్మి తిరిగి రావడంతో డెత్​సర్టిఫికెట్​రద్దు చేసేందుకు గ్రేటర్ ​ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.

మతిస్థిమితం  కోల్పోయిన లక్ష్మిని కావాలనే కుటుంబసభ్యులు రైలెక్కించి పంపారని,  ఆమెకు ఆశ్రయం కల్పించిన చెన్నై స్వచ్ఛంద సంస్థ మొదట కుటుంబసభ్యులను కాంటాక్ట్​ చేసినా భర్త, కొడుకు స్పందించలేదని మీడియాలో కథనాలు వచ్చాయి. లక్ష్మి చనిపోయినట్టు డెత్​సర్టిఫికెట్ ​తీసుకుని ఆమె పేరిట ఉన్న కోట్ల విలువైన ఆస్తిని భర్త, కొడుకు వారి పేర్ల మీదకు మార్చుకున్నారని విమర్శలు వచ్చాయి. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హనుమకొండ పోలీసులను సంప్రదించగా.. పోలీసులు కుటుంబసభ్యులతో మాట్లాడారు. దాంతో వారు లక్ష్మిని ఇంటికి తీసుకెళ్లారు.