ప్యాండెమిక్ అమ్మని ఒంటరి చేసింది!

V6 Velugu Posted on Jun 08, 2021

పిల్లలు ఎప్పుడూ తన కళ్ల ముందు ఉండాలి అనుకుంటుంది తల్లి. కానీ, ఆ కోరిక ఓ కలగానే మిగులుతోంది చాలామంది తల్లులకు. అది తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది తల్లి మనసు. ఈ కొవిడ్​ టైంలో ఈ బాధలు ఇంకా పెరిగాయి. ఇంటికి దూరంగా ఉన్న పిల్లలు ఎలా ఉన్నారో అనే బెంగ ఒక వైపు, తమకేమన్నా అయితే పట్టించుకునేదెవరు? అనే ఆందోళన మరోవైపు. ప్యాండెమిక్​కి ముందు ధైర్యంగా ఉన్న తల్లుల్లో కూడా ఇప్పుడు ఒక రకమైన గుబులు మొదలైంది.

మామూలు రోజుల్లో పిల్లలు దూరంగా ఉన్నా సరదాగా నాలుగు మాట్లాడడానికి, బాగోగులు పంచుకోవడానికి ఇరుగుపొరుగు ఉంటారు. అఫ్​కోర్స్... పిల్లలంత ఎమోషనల్​ సపోర్ట్​ బయటి వాళ్లు ఇవ్వకపోయినా కొంతైనా మనసుకి ఊరట కలుగుతుంది. కానీ, కొవిడ్​​ వల్ల.. ఎక్కడి వాళ్లు అక్కడే స్టక్ అయ్యారు. దాంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గిపోయింది. అందుకే, ఎంత వద్దనుకున్నా పిల్లల గురించిన ఆలోచనలు తల్లుల్ని వదలట్లేదు. ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోతున్నారు. కొవిడ్​ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ... పిల్లలు తమ దగ్గర లేకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ ప్యాండెమిక్‌ వల్ల ఒంటరితనం, భయం వాళ్లలో ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్‌’ని పెంచుతోంది. చాలా సర్వేలు కూడా ఈ మాటే చెబుతున్నాయి. కానీ, రియలిస్టిక్‌గా చూస్తే..  స్టడీల్లో చెప్పినదానికంటే కూడా ఈ  సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు మన దేశంలో ఎక్కువ మందే ఉన్నారట.

తల్లుల్లోనే ఎందుకంటే...

తండ్రితో పోలిస్తే..  తల్లుల్లో ఎక్కువమంది ఇల్లు దాటి వెళ్లరు.  మగవాళ్లయితే ఆఫీస్‌కి వెళ్తారు. సాయంత్రం ఫ్రెండ్స్‌ని కలుస్తుంటారు. ఇంట్లో కన్నా బయటే ఎక్కువ టైం గడుపుతారు. కానీ, తల్లికి ఆ అవకాశం ఉండదు. ఉద్యోగాలు చేసే తల్లులు చాలా తక్కువ. చేసినా.. మగవాళ్లలా సోషల్‌గా ఎంగేజ్‌ అవ్వడం ఇంకా తక్కువ. కారణం... ఆఫీస్‌ పని కంప్లీట్​ చేసుకుని వచ్చాక  ఇంటి పని ఎదురు చూస్తుంటుంది. ఆ పని పూర్తయ్యాక పిల్లలతోనే ఎక్కువగా ఎంగేజ్‌ అవుతుంటారు తల్లులు. ఉద్యోగాలు చేయని ఆడవాళ్లు అయితే నాలుగ్గోడల మధ్య ఉంటారు. పిల్లల బాగోగులు చూసుకోవడంలోనే వాళ్లకి రోజులు గడిచిపోతాయి. పిల్లలు పెద్దయ్యి, చదువులు పూర్తిచేసుకుని ఉద్యోగాల వల్లనో, పెళ్లి చేసుకునో దూర ప్రాంతాలకో, విదేశాలకో వెళ్లిపోతే తల్లి మనసు తట్టుకోలేకపోతోంది.

కూర వండేటప్పుడు ‘మా వాడికి ఈ కూర అంటే ఎంతిష్టమో’ అనిపిస్తుంటుంది. కిటికీలోనుంచి చూస్తే ‘ మా అమ్మాయి ఆ గల్లీలో ఆడేది. నేను ఇక్కడ నుంచే చూసేదాన్ని తన అల్లరిని’ అనుకుంటుంది. ఇలా కలల్లో, ఊహల్లో, పనుల్లో, పాటల్లో.. అన్నింట్లో ప్రతీ క్షణం పిల్లలే గుర్తొస్తుంటారు తల్లికి. అది తల్లి మనసును ఇంకా కుంగదీస్తుంది. ఆ కుంగుబాటు మెల్లిగా ఎంప్టీనెస్​ సిండ్రోమ్​కి దారితీస్తుంది. అయితే ఈ ప్యాండెమిక్​ వల్ల కొంతమంది తండ్రుల్లోనూ ఈ ఎంప్టీనెస్ట్​ సిండ్రోమ్​ కనిపిస్తోంది.

వాళ్లలోనే ఎక్కువ

పిల్లల పెంపకాన్ని తల్లి బాధ్యతగానే చూస్తుంది సొసైటీ. పిల్లల తప్పొప్పుల్ని తల్లి పెంపకంతోనే ముడిపెట్టి మాట్లాడతారు. పిల్లలు పుట్టడమే ఆలస్యం వాళ్ల ఆశలు, ఆశయాలపై రిస్ట్రిక్షన్స్​ పెడుతుంది సమాజం. తల్లులేమో పిల్లల సంతోషం ముందు మా గోల్స్​ చిన్నవి అనుకుంటారు. పెద్దపెద్ద చదువులు చదివినా.. పిల్లలకోసం వంటింట్లో ఆగిపోయిన తల్లులు ఎందరో. అలాంటి వాళ్లలోనే ఎంప్టీనెస్ట్​ సిండ్రోమ్​ ఎక్కువగా ఉంటోంది . ఇంత ‘చదువుకుని ఏం చేయలేకపోయా.. నాకంటూ ఓ గుర్తింపు లేదు’ అన్న బాధ వాళ్లని నిలవనీయదు. అదే కొంతమందిని మానసికంగా డిస్టర్బ్​ చేస్తుంది.

పల్లెటూళ్లతో పోలిస్తే సిటీల్లోనే ఎంప్టీనెస్ట్​​ సిండ్రోమ్​  ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు సైకియాట్రిస్ట్​లు. పల్లెటూళ్లలో మాట్లాడటానికి ఎవరో ఒకరు ఉంటారు. కానీ, సిటీల్లో పక్కింటి వాళ్లతో కూడా అంతగా పరిచయం ఉండదు. ఎంప్టీనెస్ట్​ సిండ్రోమ్​ సిటీల్లో పెరగడానికి ఇదే ముఖ్య కారణం. మరి ఈ బాధకి మెడిసిన్​ ఏంటి? అంటే... సమాధానం పిల్లలే అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.

తల్లికి ఒక హోప్ ఇవ్వాలి

పిల్లలు ఎదిగి గొప్పవాళ్లు అవడం ఎవరికైనా సంతోషమే. కానీ, ఆ పిల్లల ఎదుగుదల కనిపించనంత దూరం వెళితే? మాత్రం కచ్చితంగా వాళ్ల తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అందులోనూ తల్లి ఎక్కువగా బాధపడుతుంది. అమ్మ ప్రేమకు హద్దులు లేవు అంటాం కదా! అందుకే, దూరమైతే ఆమె తట్టుకోలేదు. ఈ కొవిడ్ టైంలో ఒకరికొకరం దగ్గర ఉండటం అత్యవసరం అయింది. ఇలాంటి టైంలో పిల్లలు దగ్గర లేనందుకు చాలామంది తల్లులు ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్‌ బారిన పడుతున్నారు. విదేశాలకు వెళ్లి, అక్కడే సెటిల్‌అయిన పిల్లలు ఉన్న వాళ్లలో.. ఈ  సిండ్రోమ్‌ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్లు పిల్లల దగ్గరకు పోలేరు. ప్యాండెమిక్ రిస్ట్రిక్షన్స్‌వల్ల పిల్లలు పేరెంట్స్‌కి హెల్ప్ చేయలేరు. ఈ పరిస్థితి వాళ్లలో విపరీతమైన భయాన్ని క్రియేట్ చేస్తోంది. అందుకే, ఒంటరితనం, విచారంతో బాధపడుతున్నారు. ఏదో కోల్పోయిన ఫీలింగ్స్‌, యాంగ్జైటీ, భయం.. లాంటి కామన్ ఫీలింగ్స్‌ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్నారు. కొంతమంది సూసైడ్ ఆలోచనలు చేస్తున్నారు. చేసుకుంటున్నారు కూడా. ఇలా ఇప్పటికే చాలామంది తమకు తాము నష్టం చేసుకున్నారు. ఆ స్టేజ్​ వరకు వెళ్లకూడదంటే  పిల్లల సపోర్ట్​ అవసరం. పిల్లలు పేరెంట్స్​ కోసం కొంచెం టైం కేటాయించి రోజూ ఫోన్‌లో మాట్లాడాలి. ఇలా చేసినప్పుడు దూరంగా ఉన్నా... ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ దగ్గరికి కూడా రాదు. ‘‘ఈ ప్యాండెమిక్ తర్వాత మళ్లీ మనమంతా కలుస్తాం, మునుపటిలా సంతోషంగా గడుపుతాం’’ అనే హోప్‌ని పిల్లలు పేరెంట్స్​కి ఇవ్వడం ముఖ్యం. దూరంగా ఉన్నా.. తమ పేరెంట్స్‌కనీస అవసరాలు తీర్చడానికి ఏదో ఒక విధంగా ప్లాన్ చేస్తే పేరెంట్స్ హ్యాపీగా ఫీలవుతారు.

- డా. సహనా రబీంద్రనాథ్‌,

స్విచ్​నౌ ఫౌండర్, ట్రాన్స్​ఫర్మేషనల్​ కోచ్​ అండ్​ థెరపిస్ట్​

కలిసి ఉంటే బాగుంటుంది

నా కూతురు గొప్పగా ఉండాలని కోరుకున్నా. కానీ, తనకి దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా కాలంలో అందరూ ఇంటి దగ్గరే ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది. కరోనా వల్ల తను ఇక్కడికి రాలేని పరిస్థితి. ఈ వయసులో మాకు కరోనా సోకితే ఎలా? అని చాలాసార్లు అనిపిస్తుంటుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు ఎంత సందడిగా ఉంటుందో... జీవితాంతం అలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ, ఏం చేయగలం? మళ్లీ మంచి రోజులు రావాలని. కోరుకోవడం తప్ప..

- ఉప్పల స్వరూప, హైదరాబాద్​

టైం కేటాయించలేకపోయాం

 చిన్నప్పుడు వాళ్లను ఉన్నత స్థితిలో ఉంచాలని చాలా కష్టపడ్డాం. ఆ కష్టంలో పిల్లలకోసం టైం కేటాయించలేకపోయాం. వాళ్లకు మంచి కెరీర్ అందించడంలో సక్సెస్ అయ్యాం. ఇప్పుడు వాళ్లతో గడుపుదాం అనుకుంటే... వాళ్లొక సిటీలో, మేమొక సిటీలో. పైగా ఈ కొవిడ్​ భయం. ఆలోచించొద్దు అనుకున్నా.. పిల్లలు గుర్తురాకుండా ఉంటారా?

 - ఎమ్​. రమ, వరంగల్​ రూరల్

ఆర్టికల్:: ఆవుల యమున

Tagged mother, corona, family, Pandemic, Isolated

Latest Videos

Subscribe Now

More News