హిజాబ్​ ఇష్యూలో తల దూర్చకండి

హిజాబ్​ ఇష్యూలో తల దూర్చకండి
  • రెచ్చగొట్టే కామెంట్లు చేస్తే సహించబోమని వార్నింగ్
  • అది తమ ఇంటర్నల్ అంశమని వెల్లడించిన ఎంఈఏ

న్యూఢిల్లీ/బెంగళూర్ : హిజాబ్ వివాదంపై విదేశాలు కామెంట్లు చేయడం పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. అది తమ ఇంటర్నల్ ఇష్యూ అని, అందులో ఎవరూ కలుగజేసుకోవద్దని స్పష్టం చేసింది. ‘‘కర్నాటకలో కొన్ని విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ అంశంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. మా రాజ్యాంగ విధివిధానాలు, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇండియా గురించి బాగా తెలిసినోళ్లు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటారు. మా ఇంటర్నల్ ఇష్యూపై రెచ్చగొట్టే కామెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. కాగా, హిజాబ్ వివాదంపై అమెరికా, పాకిస్తాన్ సహా కొన్ని దేశాల ప్రముఖులు కామెంట్లు చేశారు. స్కూళ్లలో హిజాబ్ పై నిషేధం విధించడమంటే మత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంబాసిడర్ రషద్ హుస్సేన్ అన్నారు. ముస్లిం గర్ల్స్ కు విద్యను దూరం చేయడం.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ అన్నారు. హిజాబ్ వేసుకోవద్దని భయపెట్టడం.. వాళ్లను అణగదొక్కడమేనని పేర్కొన్నారు. 

సుప్రీంలో మరో పిటిషన్.. 
హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ ఫైల్ అయింది. విద్యాసంస్థల్లో స్టాఫ్, స్టూడెంట్లకు కామన్ డ్రెస్ కోడ్ అమలు చేయాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నిఖిల్ ఉపాధ్యాయ పిల్ వేశారు. సామాజిక సమానత్వం, దేశ సమైక్యతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, కర్నాటకలో గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 

హిజాబ్​ను టచ్ చేస్తే.. 
హిజాబ్ ను టచ్ చేయాలని చూస్తే, వాళ్ల చేతులు నరికేస్తామని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) లీడర్ రుబీనా ఖానమ్ హెచ్చరించారు. శనివారం ఆమె ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో మాట్లాడారు. ‘‘మీరు దేశంలోని ఆడబిడ్డలు, అక్కాచెల్లెళ్ల ఆత్మగౌరవంతో ఆడుకోవాలని చూస్తే.. అది ఎక్కువ కాలం చెల్లదు. వాళ్లు ఝూన్సీ రాణి, రజియా సుల్తానాలా మారి.. వాళ్ల హిజాబ్ లను తాకినోళ్ల చేతులను నరికేస్తారు” అని అన్నారు. ఘూంఘట్, హిజాబ్ లు మన దేశ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమని చెప్పారు. హిజాబ్ పై వివాదం సృష్టించి, రాజకీయాలు చేయడం దారుణమని మండిపడ్డారు. మనది భిన్నత్వ దేశమని.. ఎవరేం ధరిస్తున్నరన్నది ముఖ్యం కాదని పేర్కొన్నారు.

తప్పనిసరేం కాదు.. 
తిరువనంతపురం: హిజాబ్​పై ఆందోళనలు జరుగుతున్న వేళ కేరళ గవర్నర్ ​ఆరిఫ్ ​మహ్మద్ ​ఖాన్​ కీలక కామెంట్స్ చేశారు. సిక్కిజంలో కొనసాగుతున్న టర్బన్​ఆచారంలాగా హిజాబ్​ తప్పనిసరి అని ఇస్లాంలో లేదన్నారు. ఓ చానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్​ మాట్లాడుతూ.. ‘సిక్కిజంలో టర్బన్ విధానం తప్పనిసరి ఆచారంగా కొనసాగుతోంది. అయితే ముస్లిం మహిళల వస్త్రధారణకు సంబంధించి ఖురాన్​లో ఎలాంటి ప్రస్తావన లేదు”అని అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాలు ముస్లిం మహిళలను హిజాబ్​హక్కుకోసం పోరాడేలా ప్రేరేపిస్తున్నాయని, దాని వల్ల వారు మళ్లీ చీకటి యుగంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. బయటి వ్యక్తుల ప్రేరేపణలకు స్పందించవద్దని, చదువుపై దృష్టి పెట్టాలని ముస్లిం యువతులకు ఆయన సూచించారు.
 

మరిన్ని వార్తల కోసం..

యోగి ఎట్ల చెబితే అట్ల!

ఏడాదిలోపు డిజిటల్ రూపాయి లాంచ్