భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల ప్రస్థానం .. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు .. కానీ 2025 మాత్రం అక్షయ్ ఖన్నా కెరీర్ లో ఒక స్వర్ణయుగంగా నిలిచిపోయింది. ఒకప్పుడు చాక్లెట్ బాయ్ గా అలరించిన ఈ బాలీవుడ్ స్టార్.. ఇప్పుడు విలన్ గా మారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే రూ. 2000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన రెండో భారతీయ నటుడిగా అక్షయ్ ఖన్నా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు కేవలం 'కింగ్ ఖాన్' షారుఖ్ ఖాన్ పేరు మీద మాత్రమే ఉండేది.
ఔరంగజేబుగా ఆరంభం.. 'ఛావా'తో ప్రభంజనం!
2025 ఏడాది ఆరంభంలోనే అక్షయ్ ఖన్నా తన విశ్వరూపాన్ని చూపించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ' ఛావా ' చిత్రంలో మొఘల్ చక్రవర్తిగా ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించి మెప్పించారు. ఈ సినిమాలో క్రూరత్వం, రాజసం కలబోసిన ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జనవరిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 809 కోట్లు వసూలు చేసి, ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
'దురంధర్'తో బాక్సాఫీస్ వేట!
అయితే, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని డిసెంబర్‌లో విడుదలైన 'దురంధర్' నిరూపించింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, 'రెహమాన్ డకైత్' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 1167 కోట్లు వసూలు చేసింది. శనివారం నాటి వసూళ్లతో కలిపి అక్షయ్ నటించిన ఈ రెండు సినిమాల మొత్తం వసూళ్లు రూ. 2001 కోట్లకు చేరాయి.
ఖాన్‌ల రికార్డుల వేటలో..
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే ఏడాది రూ. 2000 కోట్లు సాధించడం సామాన్యమైన విషయం కాదు. 2023లో షారుఖ్ ఖాన్ తన 'పఠాన్', 'జవాన్', 'డంకీ' చిత్రాలతో రూ. 2685 కోట్లు వసూలు చేసి ఈ క్లబ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అమీర్ ఖాన్ 'దంగల్' చిత్రంతో రూ. 2000 కోట్లకు పై వసూళ్లు సాదించి రికార్డు సృష్టించారు. అయితే ఇది రెండు సంవత్సరాలు పట్టింది. అది చైనా విడుదల వల్ల సాధ్యమైంది. ప్రభాస్ బాహుబలి-2, అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రాలతో రూ. 1700 కోట్ల మార్కును అందుకున్నప్పటికీ, 2000 కోట్ల మైలురాయిని తృటిలో కోల్పోయారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ 'రామాయణ', 'లవ్ అండ్ వార్' చిత్రాలతో ఈ రేసులో ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఖానేతర నటుల్లో (Non-Khan actor) ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా అక్షయ్ ఖన్నా నిలిచారు.
Also Read : తిరుపతిలో ‘మన శంకర వరప్రసాద్’ ట్రైలర్ రిలీజ్.. పూనకాలు తెప్పిస్తున్న మెగాస్టార్ లుక్!
నటుడిగా తనను తాను నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకునే అక్షయ్ ఖన్నా, 2025లో బాక్సాఫీస్ 'బాద్‌షా'గా అవతరించారు. విలక్షణమైన పాత్రలతో కమర్షియల్ సక్సెస్‌ను ఎలా అందుకోవాలో ఆయన నిరూపించారు. నటనలో రాణిస్తూనే వసూళ్లలోనూ రికార్డులు సృష్టించడం అక్షయ్ ఖన్నాకే చెల్లింది..
