మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే వార్త! మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్’ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తిరుపతి వేదికగా జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అందే అంటూ సోషల్ మీడియా వేదికంగా కామెంట్స్ చేస్తున్నారు.
ట్రైలర్ హైలైట్స్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండగ అంటేనే పెద్ద సినిమాల సందడి. ఈసారి ఆ సందడిని రెట్టింపు చేస్తూ, మెగాస్టార్ చిరంజీవి తన అసలు పేరుతోనే ‘మన శంకర వరప్రసాద్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, మెగాస్టార్ మేనరిజమ్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ రోజు ( జనవరి 4, 2026న ) సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని SV సినీప్లెక్స్ లో ట్రైలర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ట్రైలర్ చూస్తుంటే, చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో పాటు, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో అదరగొట్టినట్లు కనిపిస్తోంది. అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్ , హ్యూమర్‌ను సమపాళ్లలో కలిపినట్లు స్పష్టమవుతోంది.
తిరుమల శ్రీవారి చెంత చిత్ర యూనిట్
సినిమా ట్రైలర్ లాంచ్ కు ముందు, ఆదివారం ఉదయం దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వీరికి, ఆలయ పండితులు ఆశీర్వచనం అందజేశారు. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
తారాగణం
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే, ఈ చిత్రంలో అతిపెద్ద సర్ ప్రైజ్ ఏమిటంటే.. విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన వీరిద్దరి సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. వింటేజ్ చిరు, వెంకీలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు కన్నుల పండుగగా మారింది. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ బీట్స్ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తోంది. కేథరిన్ ట్రెసా, అర్చన తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
రిలీజ్ డేట్
జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా ‘మన శంకర వరప్రసాద్’ థియేటర్లలోకి రానుంది. షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి రేసులో మెగాస్టార్ తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ‘గాడ్ ఫాదర్’ తర్వాత నయనతారతో, అలాగే ‘ఎఫ్3’ ఫేమ్ అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
