అసెంబ్లీ బరిలో ఉద్యమ ఎంపీలు .. చెన్నూరు నుంచి వివేక్.. ఎల్బీనగర్​లో మధు యాష్కీ

అసెంబ్లీ బరిలో  ఉద్యమ ఎంపీలు .. చెన్నూరు నుంచి వివేక్.. ఎల్బీనగర్​లో మధు యాష్కీ
  • హుస్నాబాద్​లో పొన్నంముషీరాబాద్​లో అంజన్​ కుమార్​ యాదవ్​
  • మునుగోడు నుంచి రాజగోపాల్​రెడ్డి ​మూడోసారి పోటీ

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడిన నాటి ఎంపీలు.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆనాటి ఉద్యమ చరిత్రను జనాల్లోకి తీసుకెళ్తూ.. ఎన్నికల బాటలో దూసుకెళ్తున్నారు. వివేక్​ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, అంజన్​కుమార్​యాదవ్​ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి తప్ప మిగతా నేతలంతా తొలిసారి అసెంబ్లీ బరిలో నిలుస్తుండటం విశేషం. ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో వరుస నిరసనలు, స్పీకర్​ పోడియం ముట్టడిలో వీళ్లంతా కీలకంగా వ్యవహరించారు. రాత్రిపూట పార్లమెంట్​లోనే ఉండి ఆందోళనలు చేశారు. ఉద్యమంలో భాగంగా సస్పెన్షన్​నూ ఎదుర్కొన్నారు.

ఎల్బీనగర్​ బరిలో మధుయాష్కీ..

గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ.. తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ సోనియా గాంధీకి రిప్రెజెంటేషన్​ఇచ్చారు. అప్పుడు నిజమాబాద్​ ఎంపీగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎల్బీనగర్​నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. నాన్​లోకల్​అంటూ చాలా మంది విమర్శలు గుప్పించినా.. తాను అసలు పుట్టి పెరిగి చదువుకున్నదంతా హయత్​నగర్​ పరిధిలోనేనని వివరణ ఇచ్చుకున్నారు.

కాంగ్రెస్​ పార్టీలోని సొంత లీడర్లే ఆయనపై రెబల్​గా ఫిర్యాదు చేసినా ముందుకు సాగారు. ప్రస్తుతం కాంగ్రెస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యే సుధీర్​రెడ్డిపై ఆయన పోటీ చేస్తున్నారు. ప్రభుత్వంపై జనాల్లో ఉన్న వ్యతిరేకతనే ఆయన ఆయుధంగా మలచుకొని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి గెలిచి బీఆర్​ఎస్​లో చేరిన సుధీర్​ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత  యాష్కీకి అనుకూలంగా మారింది.

రాజగోపాల్​రెడ్డి మూడోసారి..

ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2018 ఎన్నికల్లో తొలిసారి మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్​ నుంచి ఆయన బరిలోకి దిగి బంపర్​మెజారిటీతో గెలిచారు. పలు రాజకీయ కారణాలతో బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేశారు. స్వల్ప మెజారిటీతో ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. ఇప్పుడు మూడోసారి మునుగోడు నుంచే సిట్టింగ్​ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డిపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడ టఫ్​ఫైట్​ఉండే అవకాశాలున్నా.. సీపీఐ సంప్రదాయ ఓటు బ్యాంకు రాజగోపాల్​రెడ్డికి కలిసొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. నాటి మరో ఉద్యమ ఎంపీ అంజన్​ కుమార్​యాదవ్​ తొలిసారి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. 2004, 2009లో ఎంపీగా గెలిచిన ఆయన.. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడు సిట్టింగ్​ఎమ్మెల్యే ముఠా గోపాల్​పై పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్​లో గట్టి పోటీ ఉన్నది.

బరిలోలేని ఉద్యమ ఎంపీలు..

నాడు ఉద్యమ ఎంపీలుగా ఉన్న మరికొందరు నేతలు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో లేరు. మందా జగన్నాథం, సురేశ్​షెట్కార్, సిరిసిల్ల రాజయ్య, విజయశాంతి(నాడు టీఆర్ఎస్​ఎంపీ) ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నారాయణ్​ఖేడ్​నుంచి సురేశ్​షెట్కార్​కు కాంగ్రెస్​ అధిష్టానం టికెట్​కన్ఫర్మ్​ చేసి బీఫాం ఇచ్చినా.. చివరి నిమిషంలో ఆయనే తన బీఫాంను పట్లోళ్ల సంజీవ్​ రెడ్డికి తీసుకెళ్లి ఇచ్చారు.  

ఉద్యమగళాన్ని వినిపించిన వివేక్​ వెంకటస్వామి

తన తండ్రి కాకా వెంకటస్వామి ఉద్యమ వారసత్వాన్ని ఆనాటి ఎంపీ వివేక్​ వెంకటస్వామి కొనసాగించారు. రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో నాడు పెద్దపల్లి ఎంపీగా ఉన్న వివేక్.. రైల్​రోకోలు, రాస్తారోకోల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఢిల్లీ వేదికగా తోటి ఎంపీలతో కలిసి పోరాడారు. పార్లమెంట్​ఆవరణలో ప్రతి రోజూ దీక్ష చేశారు. తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలన్న ఉద్దేశంతో తొలిసారిగా తెలంగాణకు ప్రత్యేకంగా ‘వీ6’ పేరిట ఒక మీడియా సంస్థను స్థాపించారు.

తెలంగాణ యాసను, భాషను జనాల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమంలోని ప్రతి ఘట్టాన్నీ ప్రజలకు చేరవేశారు. విద్యార్థులు, ఉద్యమకారులు, ఉద్యోగులు, ప్రొఫెసర్లు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకుల గళాన్ని వినిపించేందుకు ప్రజా వేదిక పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్​పార్టీ ఎమ్మెల్యే సుమన్​పై పోటీ చేస్తున్నారు.

సిట్టింగ్​ఎమ్మెల్యే అరాచకాలను, ఇసుక దందాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. వంద కేసులున్న బాల్క సుమన్​.. వెయ్యి కోట్లకు ఎట్లా ఎదిగారంటూ ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. 

పెప్పర్​స్ప్రేను ఎదుర్కొన్న పొన్నం ప్రభాకర్​

తెలంగాణ ఉద్యమంలో పెప్పర్​స్ప్రే ఘటన ఎన్నటికీ మరువ లేని ఘట్టం. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాటి కరీంనగర్​ఎంపీ పొన్నం.. పెప్పర్​స్ప్రే దాడిని ఎదుర్కొన్న వ్యక్తిగా నిలిచారు. తెలంగాణ బిల్లుపై ఏపీ ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా 2014 ఫిబ్రవరి14న ఏపీ ఎంపీ లగడపాటి రాజగోపాల్​రెడ్డి.. తెలంగాణ ఎంపీలపై పెప్పర్​ స్ప్రేతో దాడి చేశారు.

ఈ ఘటనలో పొన్నం కళ్లలో స్ప్రే పడటంతో ఆయన విలవిలలాడిపోయారు. ఇప్పటికీ ఆయన దాన్ని గుర్తు చేసుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన హుస్నాబాద్​బరిలో నిలిచారు. సిట్టింగ్​ఎమ్మెల్యే వొడితెల సతీశ్ ను ఎదుర్కొంటున్నారు. సీపీఐతో పొత్తు నేపథ్యంలో.. పొన్నం ప్రభాకర్​కు ఆ వర్గం ఓట్లు అక్కడ కలిసొచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటు న్నాయి. బీఆర్ఎస్​పై ఉన్న వ్యతిరేకత, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు పొన్నం ప్రభాకర్​కు అనుకూల అంశాలని చెప్తున్నారు. 

అంతా ఒకే గూటికి..

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీలంతా ఒకే గూటికి చేరారు. కొందరు మధ్యలో రాజకీయ కారణాల వల్ల పార్టీ మారినా.. ఇప్పుడు మళ్లీ పార్టీలోకి తిరిగి వచ్చేశారు. వివేక్​వెంకటస్వామి, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిలు సొంత గూటికి చేరారు. ఆనాడు టీఆర్ఎస్​ఎంపీగా ఉన్న విజయశాంతి కూడా కాంగ్రెస్​లో చేరారు. నాడు కాంగ్రెస్​ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్​రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఎంపీలలో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లంతా ఇప్పుడు హస్తం పార్టీలోనే ఉండటం విశేషం.