తమిళనాడులో సోమవారం నుంచి థియేటర్లు ఓపెన్

 తమిళనాడులో సోమవారం నుంచి థియేటర్లు ఓపెన్

చెన్నై: తమిళనాడులో సోమవారం నుంచి సినిమా థియేటర్లు నడుపుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కరోనా కట్టడి ఆంక్షలను దశలవారీగా సడలిస్తున్న తమిళనాడు ప్రభుత్వం సోమవారం నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు ఓకె చెప్పింది. అయితే థియేటర్ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని, అలాగే థియేటర్ తరచూ శానిటైజ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భౌతిక దూరం నిబంధనలో భాగంగా సినిమా థియేటర్లలో సగం శాతం ఖాళీగా ఉంచి టికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు
ఒకవైపు సినిమా థియేటర్లు, బార్లు, హోటళ్లను తిరిగి తెరిచేందుకు అనుమతించిన తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూల్లు, కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులకు అనుమతిచ్చింది. 9వ తరగతి నుంచి ఆ పై తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకునేందుకు విద్యా సంస్థలకు అనుమతిచ్చింది. అంతేకాదు స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. 8 నుంచి దిగువన 1వ తరగతి విద్యార్థుల కసం ఆఫ్ లైన్ తరగతులు నిర్వహించే విషయంపై సెప్టెంబర్ 15వ తేదీన మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. అయితే స్కూళ్లు, విద్యా సంస్థల్లో అందరూ వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. అలాగే హోటల్లు, బార్లు, దుకాణాల,వీధి వ్యాపారులందరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.