సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే...90 రోజుల ముందే ప్రకటించాలి

 సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే...90 రోజుల ముందే ప్రకటించాలి
  •     రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  •     ధరలు పెంచవద్దని ఆదేశించినా పట్టించుకోరా  అని నిలదీత
  •     హోంశాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టు ధిక్కరణగా నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు: సినిమా టిక్కెట్ల ధరల పెంపు వ్యవహారంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి తీరును హైకోర్టు తీవ్రంగా తప్పపట్టింది. ఇకపై సినిమా టిక్కెట్ ధరలను పెంచవద్దని ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ‘మన శంకర వరప్రసాద్’ సినిమా టిక్కెట్ల ధరలను పెంచడంపై మండిపడింది. సుమోటో కోర్టు ధిక్కరణగా పరిగణించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్​కు నోటీసులు జారీ చేసింది. ‘రాజాసాబ్’ సినిమాతోపాటు ఈ సినిమాకు ఒకే రోజు టిక్కెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమో జారీ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. ఇక టికెట్ల ధరలు పెంచవద్దని ఈ నెల 8వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా... 10న పబ్లిక్ డొమైన్​లో అప్లోడ్ చేయడాన్ని సుమోటో కోర్టు ధిక్కరణగా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్​ ను ప్రతివాదిగా చేర్చి నోటీసులు ఇచ్చింది. 

ఇకపై టిక్కెట్ ధరల పెంపు నిర్ణయం సినిమా విడుదలకు 90 రోజుల ముందే చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టిక్కెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ న్యాయవాది చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ఎన్.ని శ్రవణ్ కుమార్ మంగళవారం విచారించారు. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం టిక్కెట్ల పెంపుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి అప్పీలు దాఖలుకు వీలుందని న్యాయమూర్తి అన్నారు. టిక్కెట్ ధరల పెంపుపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, నగర పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు ధరల పెంపుపై అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి అప్పీల్ చేసుకునే వీలు ఉందని తెలిపారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేశారు.