రైతులను కేసీఆర్​ మోసం చేసిండు : ఎంపీ అర్వింద్​

రైతులను కేసీఆర్​ మోసం చేసిండు : ఎంపీ అర్వింద్​

మెదక్, వెలుగు: ఏకకాలంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్​ మాట తప్పి రైతులను మోసం చేశారని నిజామాబాద్​ ఎంపీ, మెదక్ అసెంబ్లీ పాలక్​ ధర్మపురి అర్వింద్​ ఫైరయ్యారు. శనివారం మెదక్​లో జరిగిన బీజేపీ బూత్ కమిటీ కన్వీనర్ల  సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేయకపోవడంతో నాలుగేండ్లుగా రైతులపై వడ్డీ భారం పడుతోందన్నారు. 2018 బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి రూ.20,166 కోట్లు బడ్జెట్ కేటాయించినట్టు చూపించారని, కానీ కేవలం రూ.1,171 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేటాయింపులో ఇది కేవలం 5.6 శాతం మాత్రమేనన్నారు. ప్రతి సెగ్మెంట్​ పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని గొప్పలు చెప్పుకున్నారని, తొమ్మిదేండ్లలో ఎన్ని ఎకరాలకు కొత్తగా నీళ్లిచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

రైతులకు డ్రిప్​పై, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీని పూర్తిగా బందు పెట్టారని, ఎరువులు ఫ్రీగా ఇస్తామని ఉత్త మాటలు చెప్పారని విమర్శించారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్​ భారత్, ఫసల్​ బీమా యోజన, పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి వంటి స్కీమ్​ల గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బూత్  కమిటీలపై ఉందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్ల రాజశేఖర్, నందు జనార్దన్​ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, అసెంబ్లీ కన్వీనర్ మధు, టౌన్​ ప్రెసిడెంట్ ప్రసాద్, శివ పాల్గొన్నారు.