డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే సమస్యలు తీరుతయ్

డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే సమస్యలు తీరుతయ్

డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే.. రాష్ట్రంలో సమస్యలు తీరుతాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే సీఎం కేసీఆరా లేక కేటీఆరా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. జగిత్యాలలోని కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్న బహిరంగసభకు హాజరైన ఆయన కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అసంబద్ధ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ప్రతి వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటోందని అర్వింద్ విమర్శించారు. రాష్ట్రాన్ని ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చకపోవడం వల్ల కోవిడ్ సమయంలో అనేక మంది చనిపోయారని మండిపడ్డారు. పంటల బీమా లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పరిహారం ఇవ్వని కేసీఆర్.. రైతు చనిపోతే మాత్రం బీమా ఇస్తానని చెబుతున్నాడని అన్నారు. సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు ప్రతిదానికి రైతు బంధు బూచి చూపిస్తున్నాడని చెప్పారు. ఏ కాలుకు దెబ్బ తగిలిందో తెలియక కేటీఆర్ ఏదో ఒక కాలికి పట్టి వేయించుకున్నాడని అర్వింద్ చురకలంటించారు.

కాళేశ్వరాన్ని వరదలో ముంచిండు
మిషన్ భగీరథ 9 రోజుల్లో ఇస్తానని కొంగర కలాన్ సభలో చెప్పి నాలుగేళ్లైనా ఇప్పటికీ పూర్తి చేయలేదని అర్వింద్ ఆరోపించారు. కేంద్రం స్కూళ్లు బాగు చేసేందుకు రూ.9700కోట్ల నిధులు ఇస్తే వాటిని కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించి కమిషన్లు తీసుకున్నడని విమర్శించారు. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టును వరదలో ముంచిండని మండిపడ్డారు. ఆదివాసీలకు పోడు భూములు ఇవ్వమంటే వారిని జైలులో పెట్టించిన ఘనత కేటీఆర్ కు దక్కిందని అన్నారు. కోరుట్లలో చెరుకు ఫ్యాక్టరీ గానీ, ఇథనాల్ పరిశ్రమలు పెట్టాలని, మళ్లీ చెరకు పండేలా చర్యలు తీసుకోవాలని అర్వింద్ డిమాండ్ చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో ఎన్ఆర్ఐ పాలసీ చేర్చాలని తరుణ్ చుగ్ ను కోరిన ఆయన.. తాము అధికారంలోకి వస్తే ముంబైకి డైలీ ట్రైన్ తెస్తానని హామీ ఇచ్చారు. 

వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తం
వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు వారిని మోసం చేసిండని అర్వింద్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇసుక దొంగలను పట్టుకున్నందుకే వీఆర్ఏలు రోడ్డున పడేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వారిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు అన్ని సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.