
నిజామాబాద్: కరోనా నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు. రోజురోజుకీ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని.. కేసీఆర్ సర్కార్ కరోనా బాధితులకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు లక్షల్లో పీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోళ్ళపై క్లారిటీ ఇవ్వలేదన్నారు అరవింద్. దేశం లోనే మూడో ప్రథమ పంట అయిన మొక్కజొన్నకు ..కేంద్రం 80 రూపాయలు పెంచి మద్దతు ధర 1850 చేసిందని..అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని అన్నారు.
దాదాపు 11 వందల కోట్ల విలువైన నాలుగు మిలియన్ టన్నుల మొక్కజొన్నను ఎగుమతి చేశామన్నారు . జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతున్నా కేసీఆర్ మాత్రం మొక్కజొన్న కు ధర లేదంటున్నారని అరవింద్ విమర్శించారు. దేశం లో ఓపెన్ మార్కెట్ లో ధర రూ.2300 ఉంటే మన రాష్ట్రం లో ధర 1250 ఎందుకుంటుందని ఆయన ప్రశ్నించారు.పెద్ద వ్యాపారులతో కుమ్మక్కై అతి పెద్ద కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు.
కేసీఆర్ అవినీతి ఆపెస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పారు ఎంపీ. దేశంలో రైతుల ఆత్మహత్య ల్లో రాష్ట్రం ఐదో స్థానం లో ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 36 రాష్ట్రాలో 32 రాష్ట్రాలు అమలు చేస్తుండగా.. తెలంగాణ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననీయదన్నట్టుగా మోదీకి పేరు రాకూడదని కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయడం లేదన్నారు.