
హుస్నాబాద్, వెలుగు: అప్పుల్లో ఉంది ఆర్టీసీ కాదని టీఆర్ఎస్ ప్రభుత్వమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తను రవాణా శాఖ మంత్రిగా పని చేసినప్పుడు ఆర్టీసీ మంచి లాభాల్లో నడిచిందన్న కేసీఆర్ నేడు సీఎం అయ్యాక ఎందుకు దివాళా తీసిందని ప్రశ్నించారు. ఓటమి భయంతో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకయ్యే ఖర్చును ఒక్క హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో పెట్టి గెలడవం కూడా గెలుపేనా అని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న14 ఆర్థిక సంఘం నిధులతో పబ్బం గడుపుకోవడమే తప్ప ప్రగతి చక్రం నడిపే సత్తా లేని ప్రభుత్వం అని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం సీఎం మొదటి లక్ష్యమన్నారు. కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధికి పెట్టిన ఖర్చు, విడుదల చేసిన ఉద్యోగాలపై దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అనంతరం అంబేద్కర్ కాలనీలో మొక్కలు నాటి గాంధీ,అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని మహనీయులకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఎంపీ బండి సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు.