కేటీఆర్​.. మీ నాన్నను తీసుకొని రా.. మేడిగడ్డకు పోదాం : బండి సంజయ్​

కేటీఆర్​.. మీ నాన్నను తీసుకొని రా.. మేడిగడ్డకు పోదాం : బండి సంజయ్​
  • కేటీఆర్​.. మీ నాన్నను తీసుకొని రా.. మేడిగడ్డకు పోదాం
  • డేట్, టైమ్ ఫిక్స్ చెయ్​.. ఇరిగేషన్ ఎక్స్​పర్ట్స్​తో కలిసి వస్త
  • మీరు తప్పు చేసి కేంద్రంపై నిందలు వేస్తరా?: బండి సంజయ్​
  • అధికారంలోకి రాగానే కేసీఆర్ ఫ్యామిలీ 
  • ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటన

కరీంనగర్, వెలుగు : మేడిగడ్డపై నిజానిజాలు తేల్చేందుకు కేసీఆర్​తో కలిసి రావాలని కేటీఆర్​కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ సవాల్​ విసిరారు. ‘‘కేటీఆర్​.. దమ్ముంటే మీ అయ్యను తీసుకొని రా..! డేట్, టైమ్​ ఫిక్స్  చెయ్. ఇరిగేషన్  ఎక్స్​పర్ట్స్​తో కలిసి నేనూ మేడిగడ్డకు వస్త.. మేం చెప్పేది వాస్తవమని నిరూపిస్త..!’’  అని అన్నారు. కేసీఆర్​ సర్కార్​ దగ్గర తప్పులు పెట్టుకొని మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై వాస్తవ నివేదిక ఇచ్చిన కేంద్ర బృందంపై కేటీఆర్​ అవాకులు చెవాకులు పేలుతున్నారని సంజయ్​ మండిపడ్డారు.

కాళేశ్వరం కోసం ఖర్చు చేసిన రూ. లక్షా 30 వేల కోట్లను బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం నుంచి  వసూలు చేస్తామని, కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేస్తామని ప్రకటించారు. కమీషన్ల పేరుతో దోచుకున్న సొమ్మునూ గుంజుతామన్నారు. కరీంనగర్​ ఎస్​ఆర్​ఆర్ కాలేజీ వద్ద వాలీబాల్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో గెలిచినవాళ్లకు ఆదివారం సంజయ్ చేతుల మీదుగా కప్ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ సహా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులన్నీ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. రేవంత్‌‌‌‌ రెడ్డిని సీఎం కానీయొద్దని ముస్లిం పెద్దలంతా  రాహుల్ గాంధీని కలిశారని, అందుకు ఆయన కూడా అంగీకరించినట్లు తనకు సమాచారం ఉందని అన్నారు.

నేడు నామినేషన్​

ఈ నెల 7న జరిగే ప్రధాని మోదీ సభకు బీసీలు భారీ సంఖ్యలో తరలిరావాలని సంజయ్​ కోరారు. కరీంనగర్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తున్నట్లు సంజయ్ వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పవర్​లోకి వచ్చిన వెంటనే బీసీని సీఎం చేస్తామని ఇప్పటికే తమ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. సంజయ్​ సీఎం అయ్యే అవకాశాలున్నాయని కర్నాటక ఎమ్మెల్యే మనప్ప చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.