రజకులను రోడ్డు పాల్జేయొద్దు: బండి సంజయ్

రజకులను రోడ్డు పాల్జేయొద్దు: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: ముస్లింల ధోబీ ఘాట్లకు, ల్యాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఫ్రీ స్కీమ్​ను వర్తింపజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ నిర్ణయంతో తరతరాలుగా ధోబీ వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్తారని బుధవారం విడుదల చేసిన ప్రెస్​నోట్​లో పేర్కొన్నారు. ఒవైసీని సంతోషపెట్టేందుకు రజకుల వృత్తిని నాశనం చేస్తారా? అని ప్రశ్నించారు. ఓ వర్గం ఓట్ల కోసమే కేసీఆర్ కుల వృత్తులను అణిచివేస్తున్నారని విమర్శించారు. 

బీసీల కుల వృత్తులను దెబ్బతీసి మజ్లిస్​ను సంతృప్తి పర్చాలన్నదే సీఎం లక్ష్యమని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ.. మైనార్టీ వర్గం ఓట్ల కోసం బీసీల బతుకులు రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తమ కుల వృత్తులు దెబ్బతిన్నాయని బీసీలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న ద్రోహాన్ని కుల వృత్తులపై ఆధారపడ్డ బీసీలు, ఎస్సీలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రజకులకు బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కలిసికట్టుగా కేసీఆర్ మత దురహంకారంపై పోరాడాలని పిలుపునిచ్చారు. కుల వృత్తులను కాపాడుకుందామని కోరారు.