- రేపటి నుంచి నిరంతరం తనిఖీలు
- మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు
- బుధవారం ఉదయం నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తాం: మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకలపై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు నజర్ పెట్టారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు రూల్స్ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకోనున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ రూపొందించిన రూల్స్ ను ఎస్పీ డి.జానకి మీడియాకు వివరించారు.
ప్రజలు తమ ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో సెలబ్రేషన్స్ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇతరులకు ఇబ్బంది కలిగేలా, వారి మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మద్యం తాగి రోడ్లపైకి వచ్చినా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవన్నారు.
డిసెంబర్ 31న రాత్రి జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతర పెట్రోలింగ్ చేస్తుందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నగరానికి సంబంధించి బై పాస్ వెంట డిసెంబర్ 31న రాత్రి నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ మార్గంలో ర్యాష్ డ్రైవింగ్, రైడింగ్, బైక్ రేసింగ్, స్టంట్స్ వంటి ప్రమాదకర చర్యలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆర్గనైజ్డ్ కార్యక్రమాలకు అనుమతి లేదు
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబరు 31న రాత్రి నిర్వహించే ఆర్గనైజ్డ్ కార్యక్రమాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పటాకులు కాల్చడం, డీజేలు ఉపయోగించడం నిషేధమని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విషెస్ పేరుతో వచ్చే లింకులతో జాగ్రత్త..
మొబైల్ ఫోన్లకు న్యూ ఇయర్ పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని ఎస్పీ సూచించారు. అవగాహన లేకుండా లింకులను క్లిక్ చేస్తే మోసపోవడం ఖాయమని హెచ్చరించారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున అపరిచితులకు వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు ఇవ్వవద్దని తెలిపారు. అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చిన న్యూ ఇయర్ మెసేజ్‌లను ఓపెన్ చేయడం, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దన్నారు.
డ్రగ్స్, గంజాయి వాడితే జైలుకే..
వేడుకల్లో నిషేధిత డ్రగ్స్, గంజాయి అమ్మినా, వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వైన్ షాపులు నిర్ణీత సమయానికే మూసి వేయాలన్నారు. మైనర్లకు మద్యం విక్రయించవద్దని, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే కేసులు నమోదు చేస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీస్ అధికారులకు లేదంటే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.
