కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని బండి సంజయ్ హెచ్చరిక

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని బండి సంజయ్ హెచ్చరిక
  • కేసీఆర్​, కేటీఆర్​ లాంటి మోసగాళ్లతో తెలంగాణ అపవిత్రమైంది: సంజయ్
  •     16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్​కు బానిసలు
  •     బీజేపీ అధికారంలోకి రాగానే వారందరికీ టెస్టులు చేస్తాం
  •     తెలంగాణ మొత్తాన్ని సంప్రోక్షణ చేస్తాం

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు : యాదాద్రి గుడిని సంప్రోక్షణ చేయడం కాదని, ముందు అయ్యాకొడుకుల నాలుకలను సంప్రోక్షణ చేయాలని సీఎం కేసీఆర్, కేటీఆర్​పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయని అలాంటి మోసగాళ్లతో రాష్ట్రం అపవిత్రమైందని, తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తామన్నారు. మునుగోడులోని బీజేపీ క్యాంప్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, బీజేపీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ తో కలిసి మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ‘‘నువ్వు, నీ అయ్య నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలే. మీరు ఒక్కటి మాట్లాడితే మేం వంద మాట్లాడగలం. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. అసలు నీ (కేటీఆర్) అయ్య యాడికి పోయిండు? ఎందుకు మా సవాల్ ను స్వీకరించలేదు? ఏ వ్యక్తి కూడా తప్పు చేస్తే తడిబట్టలతో దేవాలయానికి వెళ్లడు. నేను వెళ్లడం ద్వారా బీజేపీ నిజాయితీ ఏంటో ప్రజలకు తెలిసింది. అయినా దేవుడిని నమ్మని నాస్తికుడికి అసలు సంప్రోక్షణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు” అని సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్ కు బానిసలయ్యారని, అంతేగాక వాళ్ల అనుచరులకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనూ లేదని, గల్లీలో కూడా లేదన్నారు. వాళ్లు చేస్తున్నది భారత్ జోడో యాత్ర కాదని, టీఆర్ఎస్ తో కలిసి చేస్తున్న జోడీ యాత్ర అని ఎద్దేవా చేశారు. అమిత్ షా మునుగోడు సభకు జనం వస్తుంటే 5 కిమీల దూరంలో జనాన్ని ఆపేశారని, రాజగోపాల్ రెడ్డి నామినేషన్ టైంలో భారీ జనం వస్తుంటే వాహనాలన్నీ నిలిపేశారని, అందుకే నడ్డా సభను వాయిదా వేశామని సంజయ్ వివరణ ఇచ్చారు. ఆ సభకు బదులు ప్రతి మండల కేంద్రంలో 20 వేల మందితో 9 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఎనిమిదేండ్లలో కేసీఆర్ చేసిందేమిటి?

ఎనిమిదేండ్ల పాలనలో మునుగోడుకు సీఎం కేసీఆర్ చేసిందేమిటని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్  ప్రశ్నించారు. ప్రజా సమస్యలన్నీ గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. మునుగోడు ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని దించే ఎన్నికని, కేసీఆర్ అవినీతి, నియంత, కుటుంబ పాలనకు చరమగీతం పాడే ఎన్నిక కాబోతుందని వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ కలను బీజేపీ ఆధ్వర్యంలో సాకారం చేస్తామన్నారు. రామాయణంలో అహంకారం తలకెక్కిన రావణుడు ఎట్లా పతనమయ్యాడో... కేసీఆర్ కు సైతం అదే గతి పడుతుందన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పై కర్ణాటకలో డ్రగ్స్ కేసు ఉందని, ఆయనకు డ్రగ్స్ సప్లయర్స్ తో సంబంధాలున్నాయని వెల్లడించారు.