డాక్ట‌ర్ల‌కు పీపీఈ కిట్లు ఇవ్వాలని ముందే చెప్పాం.. అయినా పట్టించుకోలేదు

డాక్ట‌ర్ల‌కు పీపీఈ కిట్లు ఇవ్వాలని ముందే చెప్పాం.. అయినా పట్టించుకోలేదు

దేశాభివృద్ధి కోసమే ప్రధాని మోడీ ‘ఆత్మనిర్భర భారత్‌’ కింద రూ.20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీని ప్రకటించారన్నారు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో రాబోయే అనర్థాలు గుర్తించే సమాజ క్షేమం కోసం లాక్‌డౌన్‌ ప్రకటించారన్నారు. శ‌నివారం జూమ్ యాప్ ద్వారా ఎంపీ సంజ‌య్ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏడాది పాలనలో అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. 17వ లోక్‌సభలో 36 బిల్లులు ఆమోదం పొందడం నరేంద్ర మోడీ ఘనత అని చెప్పారు.

రాష్ట్రంలో కరోనా కేసుల గురించి ఎంపీ ప్ర‌స్తావిస్తూ… ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంద‌ని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా… రాష్ట్ర‌ ప్రభుత్వం వాటిని దారి మళ్లించి జేబులు నింపుకుంటుందన్నారు. డాక్ట‌ర్ల‌కు పీపీఈ కిట్లు ఇవ్వాలని బీజేపీ సూచించినా రాష్ట్ర‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కరోనా మరణాల విషయంలో ప్రభుత్వం విచిత్రంగా వ్యవహారిస్తోందని, ప్రభుత్వం ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి త‌మ‌ సలహాలు, సూచనలు స్వీకరించాలని అన్నారు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…. ఈ నెల 5, 6, 7 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాల్లో వివరిస్తున్నామ‌ని చెప్పారు. డిజిటల్‌ వేదికపైన వర్చువల్‌ ర్యాలీని 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తామ‌న్నారు. జూన్‌ 11 నుంచి 25 వరకు వీడియో కాన్పరెన్స్‌లు నిర్వహిస్తామ‌ని, జూన్‌ 11 నుంచి 17వరకు ఇంటింటికి మోడీ సందేశాన్ని లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి వేలాది టీం లు వివరిస్తాయ‌ని చెప్పారు. తెలంగాణలో 64 శాతానికిపైగా ప్రధాని నరేంద్రమోడీని అభిమానిస్తున్నట్లు ఇటీవల వెల్లడయ్యిందని ఆయ‌న అన్నారు.

mp bandi sanjay press meet through zoom app over corona cases in telangana state