ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేదానిపై చర్చ జరగలేదు : బండి సంజయ్

ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేదానిపై చర్చ జరగలేదు : బండి సంజయ్

కరీంనగర్ : పెద్దపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఏమీ జరగనట్లు కేసును నీరుగార్చారని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. హత్యలు, అత్యాచారాలు జరిగితే బాధితులను, వారి కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టి కేసులు బయటకు రాకుండా చేస్తున్నారని చెప్పారు. బాలికను నలుగురు దుండగులు ఏం చేశారన్నది తేలకుండానే ఆమెది సూసైడ్ అని తేల్చారని తెలిపారు. దిశ కేసు కంటే ఇది దారుణమైన ఘటన అని అన్నారు.

హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ మంత్రి ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ బండి సంజయ్‌. దీనివెనుక ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఉన్నాడని చెప్పారు. ఇలాంటి ఘటనల్లో నిందితులను శిక్షించకుండా వారిని కాపాడుతారా..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో తాము వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని, అప్పుడు పోలీసులతో పాటు కేసుతో సంబంధం ఉన్నవారందరూ ఇరుక్కుంటారని చెప్పారు. సీఎంఓ నుంచి ఈ కేసులో పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లిలో జరిగిన ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూలీ పని చేసుకునేందుకు వచ్చిన పేదోళ్లకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులతో పాటు, కేసును తప్పుదోవ పట్టించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

భారత ఎన్నికల కమిషన్ కు సహకరించేందుకు తాను ఓటర్ లిస్టు తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నానని చెప్పారు. తాను ఏపీ రాజకీయాలు మాట్లాడేందుకు అక్కడికి పోవడం లేదని స్పష్టం చేశారు. టికెట్ల విషయంలో తమ పార్టీ ప్రణాళిక తమకు ఉందన్నారు. డబ్బుల కోసమే ఆశావహుల నుంచి కాంగ్రెస్ నాయకులు దరఖాస్తులు తీసుకుంటున్నారని ఆరోపించారు. మద్యం షాపుల టెండర్లకు నవంబరు దాకా గడువు ఉందన్నారు. దివాళా తీసిన సర్కారు ఖజానా కోసమే ముందస్తుగా మద్యం టెండర్లు చేపట్టారని ఆరోపించారు. కేవలం మద్యం టెండర్ల దరఖాస్తుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2 వేల 500 కోట్లు వచ్చాయన్నారు. 

ఓట్ల కోసం కొత్త కొత్త స్కీమ్ లు తెచ్చే కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు ఎంపీ బండి సంజయ్‌. మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజల కొంప కొల్లేరే అని చెప్పారు. ఈ నాలుగు నెలలు ఒకటో తారీఖు జీతాలేస్తే నమ్మి ఓట్లేస్తే ..ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ జీతాలు నెల తర్వాత కూడా రావన్నారు. కాంగ్రెస్ ను నమ్మినా మళ్లీ వచ్చేది అవినీతి ప్రభుత్వమే అని చెప్పారు. కాంగ్రెస్ వస్తే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని నడపడం ఆ పార్టీ నాయకులకు సాధ్యం కాదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి మేలు కలుగుతుందన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ సంక్షేమ పథకాన్ని తాము ఆపమని, మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారు తమ పార్టీ, నాయకత్వం నచ్చేవారినే తీసుకుంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. ఎంపీలందరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న చర్చ తమ పార్టీలో జరగలేదన్నారు. మీడియాలో మాత్రమే అలా వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. 

అంతకుముందు.. ఫొటోగ్రాఫర్లందరికీ అంతర్జాతీయ ఫొటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్. మంచికి, చెడుకు సజీవ సాక్ష్యం ఫొటో అన్నారు. వేయి పదాల భావాన్ని ఒక్క ఫొటోలో చెప్పొచ్చన్నారు. కరోనా సమయంలో ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్రాణాలకు తెగించి పని చేశారని తెలిపారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. జర్నలిస్టు యూనియన్లలోనూ చీలిక తెచ్చి సీఎం కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పారు. ఫొటోగ్రఫీ డే రోజైనా కనీసం సీఎం కేసీఆర్ వారి సమస్యలను తెలుసుకోవడం లేదన్నారు.