సెంటిమెంట్ ​పేరుతో ఎంతకాలం మోసం చేస్తరు?

సెంటిమెంట్ ​పేరుతో ఎంతకాలం మోసం చేస్తరు?
  • కేసీఆర్​పై ఎంపీ బండి సంజయ్​ విమర్శలు
  • కేసీఆర్​ గొప్పలు చెప్పడం తప్ప చేసిందేం లేదు
  • లోక్​సభలో ఎంపీ బండి సంజయ్​ విమర్శ
  • రైతులకు తీవ్రంగా అన్యాయం చేశారు
  • తప్పుడు మాటలు, తప్పుడు లెక్కలు ఇంకెంత కాలం?
  • లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ

సీఎం కేసీఆర్​ సెంటిమెంట్​ను వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు. రాష్ట్రానికి మంచి జరిగితే తన ఖాతాలో వేసుకుంటారని, చెడేదన్న జరిగితే కేంద్రాన్ని నిందిస్తారని విమర్శించారు. రైతులకు కేంద్ర పథకాలు అందకుండా చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్డీయే ఎన్నో చర్యలు చేపడుతోందన్నారు. మంగళవారం లోక్​సభలో బండి సంజయ్​ మాట్లాడారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులను ప్రస్తావిస్తూ.. సీఎం కేసీఆర్ తీరును, టీఆర్ఎస్​ సర్కారు పాలనను ఎండగట్టారు.

సంజయ్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

‘‘తెలంగాణ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీని. బడ్జెట్ పై చర్చలో పాల్గొనే అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు. అజ్ఞానంలో బతికేవారికి ఆ చీకటిలో నిజమైన జ్ఞాని కనపడడు. మొన్నటి ఎన్నికల్లో జనం చేతిలో చావుదెబ్బ తిన్న పార్టీలు, నాయకుల తీరు అచ్చం ఇట్లానే ఉంది. మా రాష్ట్ర సీఎం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అన్నట్టు ఆయన తీరు ఉంటుంది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెగ మొత్తుకుంటున్నారు. మనోహరాబాద్-పెద్దపల్లి రైల్వేలైన్​కు ఎన్డీయే ప్రభుత్వమే నిధులిచ్చింది. భారీ ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు రెండో దశ పనులకు కూడా రూ.120 కోట్లు ఇచ్చారు.

రైతులకు అన్యాయం చేశారు..

రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప సీఎం చేసిందేమీ లేదు. పలు రాష్ట్రాల రైతులకు కేంద్రం సాయిల్ హెల్త్ కార్డులిస్తూ రూ. 700 కోట్లు విడుదల చేసింది. ఆ సొమ్ము ఏమైంది? రైతుల కోసమే కేంద్రం ఫసల్ బీమా పెడితే తెలంగాణలోని 5 లక్షల మందికి బీమా కట్టించకుండా అన్యాయం చేశారు. మహారాష్ట్ర బీజేపీ సర్కారు ఒకేసారి లక్షా 60 వేల ఇళ్లను పేదలకు అందజేసింది. కేసీఆర్​డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని అధికారంలోకి వచ్చారు. కానీ అమలు చేయలేదు. వ్యక్తిగత ప్రతిష్టకుపోయి కేంద్ర పథకాలను అమలు చేయడం లేదు. సెంటిమెంట్ ను వాడుకుంటూ ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు? తప్పుడు మాటలు, తప్పుడు లెక్కలు ఇంకెంత కాలం? పేదల ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?

వారసత్వ రాజకీయాలు వద్దు

75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో 60 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేసిందేమిటో అందరికీ తెలుసు. వారసత్వ రాజకీయాలు కాదు, దేశం కోసం రాజకీయాలు చేయాలి. మత రాజకీయాలు మీరు చేస్తూ బీజేపీ మీద ఆ ముద్ర వేశారు. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే సమాధానం ఇచ్చారు. దాంతో వారు దిక్కుతోచక అసహనంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధాని మోడీ ఉత్తమ పాలన అందిస్తున్నారు.

లక్షల కోట్లు దుర్వినియోగం

మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత అంటూ లక్షల కోట్లను దుర్వినియోగం చేసిందీ, చేస్తున్నదీ కేసీఆర్​సర్కారే. అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. ఎఫ్ఆర్​బీఎం పరిమితి పెంచి, కేంద్రం ఇచ్చిన పూచీకత్తు మీద వచ్చిన నిధులతోనే కదా మిషన్​ భగీరథ పనులు ప్రారంభించారు. ఎయిమ్స్ కు 1,250 కోట్లు కేటాయిస్తే ఇంతవరకు పునాదిరాయి ఎందుకు వేయలేదు? అడిగిందే తడవుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చింది కేంద్ర సర్కారు కాదా?