
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను హైదరాబాద్ లో రాజ్ భవన్ లో కలిశారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సమావేశంలో చర్చించిన వివరాలను మీడియాకు వివరించారాయన. “రెండు విషయాలపై గవర్నర్ ను కలిశాం. కరీంనగర్ లో గ్రానైట్ తవ్వకాలు, అవకతవకలపై గవర్నర్ కు వివరించాం. 2008 నుండి 2011 ఎనిమిది క్వారీలలో అనుమతులు ఇచ్చినప్పటికీ అంతకుమించి తవ్వకాలు జరిపారు. అక్రమ మైనింగ్ సంబంధించి వేసిన జరిమానా రూ.749 కోట్లు బకాయిలు కట్టకుండా ఉండిపోయారు. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన వేతనం ఇవ్వట్లేదు. మైనింగ్ పై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరాం”అని బండి సంజయ్ చెప్పారు.
ప్రభుత్వ ఆదాయానికి మైనింగ్ మాఫియా గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరినట్టుగా చెప్పారు ఎంపీ బండి సంజయ్. గ్రానైట్, మైనింగ్ విషయంలో గతంలో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశామనీ.. రానున్న రోజుల్లో కోర్టును ఆశ్రయిస్తామమని చెప్పారు. మైనింగ్ విషయంలో సీబీఐ విచారణకు ఆయన డిమాండ్ చేశారు.