సీఎం సభతో కాంగ్రెస్ క్యాడర్​లో జోష్​

సీఎం సభతో కాంగ్రెస్ క్యాడర్​లో జోష్​
  • రోడ్​ షో,  బహిరంగ సభ సక్సెస్

మెదక్, మెదక్ టౌన్​, వెలుగు : ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్​రెడ్డి ప్రసంగంతో కాంగ్రెస్​ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మెదక్​కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం  మెదక్​పట్టణంలో నిర్వహించిన రోడ్​ షో,  బహిరంగ సభ సక్సెస్​ కావడంతో పార్టీ క్యాడర్​లో జోష్​ పెరిగింది. ధ్యాన్​ చంద్ చౌరస్తా నుంచి రాందాస్​ చౌరస్తా వరకు జరిగిన రోడ్​ షోలో అభ్యర్థి నీలం మధుతో పాటు సీఎం రేవంత్​రెడ్డి

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్ ఎమ్మెల్యే రోహిత్​, ఆయా నియోజకవర్గాల ఇన్​చార్జీలు పాల్గొన్నారు. రోడ్​ షోతో పాటు, రాందాస్​ చౌరస్తాలో జరిగిన సభకు లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు.

కేసీఆర్ ఇంకా సీఎం అనే సోయిలోనే ఉన్నాడు

బీఆర్ఎస్​ పాలనతో విసిగిపోయిన ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టారని, అధికారం కోల్పోయి నాలుగు నెలలైనా కేసీఆర్​ ఇంకా తాను సీఎం అనే సోయిలోనే ఉండి ఎర్రి వాగుడు వాగుతున్నాడని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అధికారం పోయినా ఇంకా సీఎం అనే దొర పోకడ ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏం చూసి బీఆర్ఎస్​లోకి 20,  30 మంది ఎమ్మెల్యేలు వస్తారని ప్రశ్నించారు. కేసీఆర్​ త్వరలోనే బీజేపీలో జాయిన్​ అవుతారని పొంగులేటి అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..  

తొమ్మిదిన్నరేళ్ల కుటుంబ, దొర పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని, అందులో మెదక్ పక్కా ఉంటుందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ లోక్​ సభ ఎన్నికల ఇన్​చార్జి కొండా సురేఖ మాట్లాడుతూ..  దోపిడీదారు, దుర్మార్గుడైన బీఆర్​ఎస్​ అభ్యర్థిని ఓడించి, బీసీ బిడ్డ నీలం మధును ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్​ కార్యకర్తలు ఛాలెంజీగా తీసుకుని, సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు చేతి గుర్తు మీద ఓట్లు దంచి నీలం మధును ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు.

లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ఎంపీగా గెలిచి ప్రధాన మంత్రి పదవి అలంకరించిన మెదక్ స్థానంలో తనకు కాంగ్రెస్​ టికెట్​ రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే వారంలో ఒకరోజు అసెంబ్లీ సెగ్మెంట్​లో ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

కార్యక్రమలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు​, నర్సాపూర్​ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఆయా నియోజకవర్గ ఇన్​చార్జీలు నర్సారెడ్డి, ఆవుల రాజిరెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్​, హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్​, నిర్మలాజగ్గారెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ చంద్రపాల్​ పాల్గొన్నారు.