- కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఎంపీ చామల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ కోసం రూ.14 కోట్లు రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కమిషనర్ బీనా మహాదేవన్ లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పోచంపల్లి ఇకాట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ స్కీం కింద రూ.14 కోట్ల నిధులు అవసరమని వివరించారు. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న పీఎండీ లోన్స్ బకాయిల కారణంగా ఈ హ్యాండ్లూమ్ పార్క్ నిర్వీర్యమై వేలానికి వెళ్లిందని తెలిపారు.
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్‌ను కొనుగోలు చేసి, సంప్రదాయ నేత వృత్తిదారుల జీవనోపాధికి అండగా నిలిచిందని తెలిపారు. చేనేత వృత్తిదారులను దృష్టిలో పెట్టుకుని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు సాయం చేయాలని అభ్యర్థించారు. కాగా..ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. గురువారం పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ఆర్ రఘురామ్ రెడ్డి, సురేశ్ శెట్కార్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
