మెట్రో ఫేజ్-2కు ఎందుకు అనుమతివ్వట్లేదు? : ఎంపీ చామల

మెట్రో ఫేజ్-2కు ఎందుకు అనుమతివ్వట్లేదు? : ఎంపీ చామల
  •   చిన్న సిటీలకు పర్మిషన్ ఇచ్చి..తెలంగాణను ఎందుకు విస్మరిస్తున్నరు: ఎంపీ చామల
  • తక్షణమే కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో మంజూరు చేయండి

న్యూఢిల్లీ, వెలుగు : హైదరాబాద్ కంటే చిన్న సిటీల్లో మెట్రో రైల్ విస్తరణకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న తెలంగాణలోని హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–-2కు ఎందుకు సహకరించడం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ తో పొల్చితే ఆగ్రా, భోపాల్, భువనేశ్వర్, ఇండోర్, పుణె, సూరత్, త్రివేండ్రం వంటి చిన్న నగరాల్లో జాయింట్ వెంచర్ కింద మెట్రో రైల్ ప్రాజెక్ట్ లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. 

తక్షణమే కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యం కింద హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2 మంజూరు చేయాలని మంగళవారం లోక్ సభలో రూల్ 377 కింద లేవనెత్తారు. పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్, పొల్యూషన్ తో హైదరాబాద్​ సమస్యలను ఎదుర్కోంటున్నదని సభ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు.. తెలంగాణ ప్రభుత్వం రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 5 కారిడార్లను (76.4 కి.మీ) కవర్ చేసే హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ –2 కు శ్రీకారం చుట్టిందన్నారు. 

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే... కేంద్ర  గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిందని పేర్కొన్నారు. గతేడాది నవంబర్ లో డిటైర్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) అందజేసిందని తెలిపారు. మెట్రో ప్రాజెక్ట్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ కు అయ్యే మొత్తం ఖర్చులో కేంద్ర వాటా కింద రూ. 4,230 కోట్లు (18%), తెలంగాణ ప్రభుత్వం వాటా కింద రూ.7,313 కోట్లు (30%) భరించనున్నట్లు తెలిపారు.